Odissa Train Accident | రైలు ప్రమాదంపై సమాచారమిచ్చిన తొలి వ్యక్తి.. ఎవ‌రంటే..?

Odissa Train Accident లీవ్‌పై వెళుతున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ జవాన్‌ ఆయన ఇచ్చిన సమాచారమే మొదటిది విధాత: దాదాపు మూడు దశాబ్దాల కాలంలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం గురించి ప్రపంచానికి మొట్టమొదటగా చెప్పిన వ్యక్తి ఓ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ జవాన్‌. సెలవుపై ఉన్న ఆ జవాన్‌.. ఘటన జరిగిన సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఈ ప్రమాదంలో 288 మంది చనిపోగా, 1100 మంది వరకు గాయపడినట్టు తెలుస్తున్నది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన సదరు జవాన్‌.. ఉన్నతాధికారులకు […]

  • Publish Date - June 4, 2023 / 01:59 PM IST

Odissa Train Accident

  • లీవ్‌పై వెళుతున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ జవాన్‌
  • ఆయన ఇచ్చిన సమాచారమే మొదటిది

విధాత: దాదాపు మూడు దశాబ్దాల కాలంలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం గురించి ప్రపంచానికి మొట్టమొదటగా చెప్పిన వ్యక్తి ఓ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ జవాన్‌. సెలవుపై ఉన్న ఆ జవాన్‌.. ఘటన జరిగిన సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు.

ఈ ప్రమాదంలో 288 మంది చనిపోగా, 1100 మంది వరకు గాయపడినట్టు తెలుస్తున్నది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన సదరు జవాన్‌.. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడమే కాకుండా వెంటనే విధి నిర్వహణలోకి దిగారు. ఆ జవాన్‌ పేరు ఎన్‌కే వెంకటేశ్‌. సెలవుపై ఉన్న వెంకటేశ్‌.. బెంగాల్‌లోని హౌరా నుంచి తమిళనాడుకు వెళుతున్నారు. ఈయన ప్రయాణిస్తున్న బీ-7 బోగీ పట్టాలు తప్పడంతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

కోల్‌కతాలోని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రెండో బెటాలియన్‌లో పని చేస్తున్న 39 ఏళ్ల వెంకటేశ్‌.. ఘటన జరిగిన వెంటనే తన సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్‌ చేసి.. సమాచారం అందజేశాడు. లైవ్‌ లొకేషన్‌, కొన్ని ఫొటోలను వాట్సాప్‌ ద్వారా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కంట్రోల్‌ రూమ్‌కు పంపించాడు. ఈ సమాచారం అందగానే మొదటి సహాయ బృందం స్పాట్‌కు చేరుకున్నదని అధికారులు తెలిపారు.

‘ఒక్కసారిగా పెద్ద కుదుపు వచ్చింది. కొంతమంది ప్రయాణికులు కిండపడటం కనిపించింది. ఒక ప్రయాణికుడిని నేను బయటకు తీసుకొచ్చి రైల్వే ట్రాక్‌ వద్ద కూర్చొనబెట్టాను. ఆ వెంటనే ఇతరులను రక్షించేందుకు వెళ్లాను’ అని ఆయన ఒక వార్తా సంస్థకు చెప్పారు.

స్థానికులు, అక్కడి మెడికల్‌ షాపుల వారు నిజమైన రక్షకులని ఆయన చెప్పారు. ఘటన గురించి తెలిసిన వెంటనే వారంతా అక్కడికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారని, మెడికల్‌ షాపుల వారు ఔషధాలు తీసుకువచ్చారని తెలిపారు. అంతా తమకు తోచిన రీతిలో సేవలందించారని ప్రశంసించారు.