Operation Sindoor: పహల్గామ్ మృతుల కుటుంబాలకు న్యాయం కోసమే ఆపరేషన్ సిందూర్

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించాయని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మిస్రీతో కలిసి తొలిసారిగా ఇద్దరు మహిళా సైనాధికారులు మీడియాకు వెల్లడించారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా వాటిని ధ్వంసం చేశామని తెలిపారు.
గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను క్రమపద్ధతిలో నిర్మించిందని ఆరోపించారు. ఉగ్రవాద బోధనా కేంద్రాలు, రిక్రూట్ మెంట్ కేంద్రాలుగా ఉన్న శిక్షణా ప్రాంతాలను, ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్ కేంద్రాలను నేలమట్టం చేశామని తెలిపారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు పాల్పడ్డాయన్నారు. ఆపరేషన్ సిందూర్ ఆరంభం మాత్రమేనన్నారు.
బాధ్యతాయుత రీతిలో భారత్ దాడులు చేసిందని అన్నారు. పౌరులకు హాని జరగకుండా పాక్ ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. స్వీయ రక్షణ తమ హక్కు అని కూడా తెలిపారు. నిఘా వర్గాల కచ్చితమైన సమాచారంతో తాము పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఎంచుకున్నట్టు కల్నల్ సోఫియా ఖురైషీ పేర్కొన్నారు. లాహోర్‌కు ఉత్తరాన ఉన్న మురిద్కే ఉగ్రకేంద్రంలో 26/11 ముంబై నిందితులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీలకు ట్రెయినింగ్ ఇచ్చారని పేర్కొన్నారు.