Medak | సమ్మెలో పంచాయితీ కార్మికులు
Medak గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త ప్రజారోగ్యం.. కార్మికుల సమస్యలు గాలికి విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: వేకువజామునే పల్లె ల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేస్తు..ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు చెత్తను చేరవేసే స్వచ్చత యోధులు పంచాయితీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రామాల్లో చెత్త చెదారం పేరుకుపోయి పారిశుధ్య సమస్యలు జఠిలమవుతున్నాయి. చెత్త సేకరణ, తరలింపుతో పాటు వీధుల్లో చీకట్లను పారద్రోలేందుకు స్తంభాలు ఎక్కి వీధి దీపాలను అమర్చి వెలుగులు వచ్చేలా చేసే […]
Medak
- గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త
- ప్రజారోగ్యం.. కార్మికుల సమస్యలు గాలికి
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: వేకువజామునే పల్లె ల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేస్తు..ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు చెత్తను చేరవేసే స్వచ్చత యోధులు పంచాయితీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రామాల్లో చెత్త చెదారం పేరుకుపోయి పారిశుధ్య సమస్యలు జఠిలమవుతున్నాయి. చెత్త సేకరణ, తరలింపుతో పాటు వీధుల్లో చీకట్లను పారద్రోలేందుకు స్తంభాలు ఎక్కి వీధి దీపాలను అమర్చి వెలుగులు వచ్చేలా చేసే విధులు, మంచినీటీ సరఫరా విధులు కూడా పంచాయితీ కార్మికులే నిర్వహిస్తున్నారు.
ఎండ,వాన, చలిని లెక్క చేయకుండా వేతనాలు తక్కువైనా విధులు నిర్వర్తిస్తూ పంచాయతీల అభివృద్ధికి పాటుపడుతున్న పంచాయతీ కార్మికులు తమ సమస్యల సాధనకు చేపట్టిన సమ్మె పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న తీరు విమర్శలకు తావిస్తుంది. పంచాయితీ కార్మికుల సమ్మె గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రభావం చూపుతుండగా, అసలే వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో పారిశుద్ధ్యం పడేకేస్తుంది.
ఈ నెల 6 నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్న విషయం విదితమే. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని గ్రామపంచాయితీ లలో సమ్మె కొనసాగుతుంది. మెదక్ జిల్లా పరిధిలోని 21మండలాలు 465 గ్రామ పంచాయితీల్లో కార్మికులు సమ్మె కొనసాగుతుంది. పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్న చోట ప్రజాప్రతినిధులే చెత్త చెదారం తొలగిస్తున్నారు.
నిలిచిన వేతనాలు..బతుకులు ఆగం
పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు కొద్ది నెలలుగా నిలిచిపోయాయి. వీరికి సాధారణంగా రూ.5,800 వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా పనిచేస్తున్న కార్మికులకు సర్దుబాటు చేస్తూ ఈ వేతనంలో కోత విధిస్తున్నారు. వచ్చే జీతం కూడా సకాలంలో చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.
గతంలో జీవన జ్యోతి, ప్రధానమంత్రి సురక్షాయోజన కింద బీమా సౌకర్యం ఉండేది. గతేడాది నుంచి ప్రభుత్వం బీమా నగదు చెల్లించడం లేదు. అపరిశు భ్ర వాతావరణంలో పనిచేస్తుండటంతో అనారోగ్యం బారిన పడుతున్నామని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. బీమా సౌకర్యం లేకపోవడంతో కుటుంబాలకు భరోసా ఉండటం లేదని వాపోతున్నారు.
సమస్యలు పరిష్కరించకనే సమ్మెబాట
పంచాయతీ కార్మికులకు నెలకు ప్రస్తుతం రూ.8,500 వేతనంగా చెల్లిస్తున్నారు. అది గ్రామ పంచాయతీల నుంచే, నిధుల లభ్యతను బట్టి వేతనాల చెల్లింపులో వెనుకాముందు అవుతోంది. అందరినీ మల్టీ పర్పస్ కార్మికులుగా గుర్తించారు. పంచాయతీ కార్మికులు ప్రస్తుతం ట్రాక్టర్ డ్రైవర్లుగా, వాటర్మెన్, ఎలక్ట్రిషియన్లుగా, పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు.
గ్రామాల్లో వీధులు, రహదారులను శుభ్రం చేస్తున్నారు. మురుగు కాల్వల్లో పూడిక తీస్తున్నారు. సీజనల్ వ్యాధులు తలెత్తకుండా బ్లీచింగ్, ఫాగింగ్ చేస్తున్నారు. ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి తిరుగుతూ చెత్త చెదారాలు సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఇప్పుడు వీరు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు పూనుకున్నారు.
కార్మికుల డిమాండ్లు ఇవే
జీవో నంబర్ 51 సవరించాలి. గ్రామ పంచాయతీ నుంచి కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలి. మల్టీపర్పస్ విధానాన్ని ఎత్తివేయాలి. కార్మికులు, ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. రూ.19 వేలు వేతనంగా చెల్లించాలి. రూ.10లక్షల ఆరోగ్య బీమా, ప్రమాద బీమా అమలు చేయాలి.
ఏటా అందించే ఏకరూప దుస్తులు, చెప్పులు, సబ్బులు, నూనెలకు బదులు డబ్బులను అలవెన్సుల రూపంలో అందజేయాలి. విధి నిర్వహణలో మృతి చెందితే రూ.10 లక్షలు పరిహారంగా అందజేయాలి. పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ సౌకర్యాలను కల్పించాలి. ట్రాక్టర్ డ్రైవర్లకు లైసెన్సుల జారీతో పాటు ప్రమాదంలో మృతి చెందితే అంత్యక్రియలకు తక్షణ సాయంగా రూ.30 వేలు ఇవ్వాలి. ఉన్నతాధికారుల వేదింపులను ఆపాలి.
డిమాండ్‌లు నెరవేరిస్తేనే సమ్మె విరమిస్తాంః పంచాయతీ కార్మికుడు
గ్రామ పంచాయతీ కార్మికుల, ఉద్యోగుల సమస్యలపై అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాం. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరవధిక సమ్మె బాట పట్టాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఎటువంటి భేషజాలకు పోకుండా న్యాయబద్ధమైన పంచాయతీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి. లేకపోతే సమ్మెను ఇలాగే కొనసాగిస్తాం.
కార్మికుల న్యాయ బద్ద డిమాండ్ ను ప్రభుత్వం పరిష్కరించాలి..సీఐటీయు నాయకుడు రవి…
గ్రామపంచాయతీ కార్మికుల న్యాయ బద్ద డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని సీఐటీయు ఉమ్మడి జిల్లా నాయకుడు రవి డిమాండ్ చేశారు.గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదు. మంత్రి హరీష్ రావు కల్పించుకొని కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram