PM Modi | ఎర్రకోటపై మళ్లీ నేనే

PM Modi |  జాతి సాధించిన విజయాలు వివరిస్తా దేశంలో అమృత్‌కాల్‌ నడుస్తున్నది 2047కి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అందుకు పునాది పడేది ఇప్పుడే ఈ అవకాశాన్ని ప్రజలు చేజార్చుకోవద్దు ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని వ్యాఖ్యలు అహంకారాన్ని చాటుకున్న ప్రధాని గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీకి ఇది ఆఖరుసారి : లాలూ ప్రసాద్‌ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే స్వాతంత్ర్య దినోత్సవాల్లో మళ్లీ తానే ప్రసంగిస్తానంటూ ఎర్రకోట నుంచి చేసిన […]

  • By: Somu    latest    Aug 15, 2023 11:31 AM IST
PM Modi | ఎర్రకోటపై మళ్లీ నేనే

PM Modi |

  • జాతి సాధించిన విజయాలు వివరిస్తా
  • దేశంలో అమృత్‌కాల్‌ నడుస్తున్నది
  • 2047కి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌
  • అందుకు పునాది పడేది ఇప్పుడే
  • ఈ అవకాశాన్ని ప్రజలు చేజార్చుకోవద్దు
  • ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని వ్యాఖ్యలు
  • అహంకారాన్ని చాటుకున్న ప్రధాని
  • గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు
  • ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
  • మోదీకి ఇది ఆఖరుసారి : లాలూ ప్రసాద్‌

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే స్వాతంత్ర్య దినోత్సవాల్లో మళ్లీ తానే ప్రసంగిస్తానంటూ ఎర్రకోట నుంచి చేసిన ఉపన్యాసంలో ప్రధాని మోదీ (PM Modi) వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఎర్రకోటపై జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని మోదీ తన రాజకీయ అవసరాలకు వాడు కోవడంపై పలువురు రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది ఆయన అహంకారాన్ని చాటుతున్నదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎర్రకోటపై కాదని, ఆయన ఇంట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం తథ్యమని తేల్చి చెప్పారు.

ఇదే అంశంపై ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. మోదీ ఎర్రకోటపై జెండా ఎగరేయడం ఇదే ఆఖరుసారి అని అన్నారు. ‘ఈసారి మేం వస్తాం’ అని చెప్పారు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి మాట్లాడిన మోదీ.. ‘వచ్చే ఏడాది ఎర్రకోట వద్ద మిమ్మల్ని మళ్లీ కలుస్తాను’ అని వ్యాఖ్యానించారు.

పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ.. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు ముందు చివరిసారి ఎర్రకోటపై జెండా ఎగరేశారు. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా భారతదేశం సాధించిన విజయాలను తెలియజేస్తానని చెప్పారు. ‘వచ్చే ఏడాది ఇదే ఎర్రకోటపై నుంచి ఆగస్ట్‌ 15న.. జాతి సాధించిన విజయాలను వివరిస్తాను.

గొప్ప విశ్వాసంతో మీ బలం, మీ సంకల్పం, మీ విజయంపై విజయగీతికలు పాడుతాను’ అని అన్నారు. దీనిపై మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. మోదీ గెలుపోటములు ఆయన చేతిలో లేవని, ఈ దేశ ప్రజలు, ఓటర్ల చేతిలో ఉన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పారు. 2024లో పతాకావిష్కరణ నేనే చేస్తానని 2023లోనే చెప్పడం మోదీ అహంకారమేనని వ్యాఖ్యానించారు.

రాబోయే ఐదేళ్లలో ఎన్నడూ చూడని అభివృద్ధి

‘2014లో నా వాగ్దానాలను నమ్మి ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. 2019లో నా పనితీరు చూసి ఆశీర్వదించారు. రాబోయే ఐదేళ్లు మునుపెన్నడూ లేనంత అభివృద్ధి జరుగబోతున్నది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మర్చాలన్న కల నెరవేరే బంగారు సమయం’ అని మోదీ అన్నారు. బానిస మనస్తత్వం నుంచి బయటపడిన భారత్‌.. కొత్త విశ్వాసం, సంకల్పంతో ముందుకు సాగుతున్నదని అన్నారు.

స్వాతంత్య్ర అమృత్‌కాల్‌లో మనం జీవించడం అదృష్టమని చెప్పారు. ఈ కాలంలో తీసుకునే నిర్ణయాలు, చేసే త్యాగాలు రాబోయే వెయ్యేళ్ల కాలాన్ని నిర్దేశిస్తాయన్న మోదీ.. ఆ అవకాశాన్ని ప్రజలు కోల్పోవద్దంటూ పరోక్షంగా రాజకీయ ఉపన్యాసం ఇచ్చారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు దేశానికి పట్టిన చీడలని వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా తాను తన జీవితాంతం పోరాడుతూనే ఉంటానని చెప్పుకొన్నారు.

ప్రజాస్వామ్యంలో కుటుంబపార్టీలా?

పనిలోపనిగా కాంగ్రెస్‌, వివిధ రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను పరోక్షంగా టార్గెట్‌ చేసిన మోదీ.. కుటుంబ రాజకీయాల అంశాన్ని ప్రస్తావించారు. కుటుంబ పార్టీలు కుటుంబం చేత, కుటుంబం కోసం, కుటుంబాలు నడిపే పార్టీలని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కుటుంబ పార్టీలు ఎలా మనుగడ సాగిస్తాయని నిలదీశారు.

ఇటువంటి కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా మనం పోరాడాలని పిలుపునిచ్చారు. భారతదేశం విశ్వ మిత్రగా ఎదిగిందని చెప్పారు. నా వల్లే కొత్త పార్లమెంటు గత 25 ఏళ్లుగా కొత్త పార్లమెంటు భవనం అనేది చర్చల్లోనే ఉండిపోయిందని మోదీ చెప్పారు. ‘కానీ.. ఇక్కడున్నది మోదీ.. అనుకున్న సమయం కంటే ముందే దాని నిర్మాణం పూర్తి చేశాం’ అని అన్నారు.

మణిపూర్‌లో త్వరలో శాంతి

ఇటీవల మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయన్న ప్రధాని త్వరలోనే అక్కడ శాంతి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. మణిపూర్ ప్రజలకు దేశం అండగా ఉందని, ప్రజలు ఈ శాంతి సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. శాంతి ద్వారానే దేశం వృద్ధి చెందుతుందని, శాంతిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగుతాయని చెప్పారు.

పరివార్‌జన్‌.. అంటూ ప్రసంగం ప్రారంభం

సాధారణంగా మోదీ మాట్లాడేటప్పుడు భాయి ఔర్‌ బెహనో.. అని, లేదా .. మిత్రో.. అని మొదలు పెడతారు. కానీ.. ఈసారి కొత్త పదాన్ని ఎంచుకున్నారు. ‘పరివార్‌జన్‌’ (కుటుంబ సభ్యులు) అని మొదలు పెట్టడం విశేషం. దుస్తుల విషయంలో శ్రద్ధ తీసుకునే మోదీ.. ఈసారి కూడా తలకు రంగురంగుల రాజస్థానీ తలపాగా ధరించి, ఆఫ్‌వైట్‌ కుర్తా, చుడీదార్‌ వేసుకున్నారు.