భారత గగన్‌యాన్‌ సిబ్బంది వీరే! నలుగురు వ్యోమగాముల పేర్లు వెల్లడించిన ప్రధాని మోదీ

భారతదేశ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు గగన్‌యాన్‌లో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రపంచానికి వెల్లడించారు

  • By: Somu    latest    Feb 27, 2024 10:45 AM IST
భారత గగన్‌యాన్‌ సిబ్బంది వీరే! నలుగురు వ్యోమగాముల పేర్లు వెల్లడించిన ప్రధాని మోదీ

తిరువనంతపురం: భారతదేశ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు గగన్‌యాన్‌లో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రపంచానికి వెల్లడించారు. ఈ నలుగురు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు.. భారత గడ్డ మీద నుంచి భారతదేశం తయారుచేసిన అంతరిక్ష వాహక నౌకలో వెళ్లనున్న తొలి భారతీయులు. ఈ బృహత్‌కార్యంలో గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ బాలకృష్ణన్‌, గ్రూప్‌ కెప్టెన్‌ అజిత్‌ కృష్ణన్‌, గ్రూప్‌ కెప్టెన్‌ అంగద్‌ ప్రతాప్‌, వింగ్‌ కమాండర్‌ శుభాంశు శుక్లా పాలుపంచుకోనున్నారు. వీరికి ఇప్పటికే రష్యాలో పెద్ద ఎత్తున శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం ఇస్రో శిక్షణ కేంద్రంలో వారి శిక్షణాకార్యక్రమం కొనసాగుతున్నది.


మంగళవారం తిరువనంతపురంలోని ఇస్రో కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆస్ట్రొనాట్‌ వింగ్స్‌ను ఈ నలుగురికీ ప్రధాని మోదీ అలంకరించారు. వారికి స్టాండింగ్‌ ఒవేషన్‌ అందించిన మోదీ.. ‘విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో మనం చరిత్రాత్మక పయనాన్ని చూస్తున్నాం. తన నలుగురు గగన్‌యాన్‌ వ్యోమగాములను భారత్‌ కలుసుకున్నది. ఇవి కేవలం నాలుగు పేర్లు కావు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను రోదసిలోకి తీసుకుపోయే శక్తులు’ అన్నారు. విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో గగన్‌యాన్‌ మిషన్‌ ప్రగతిపై సమీక్షించిన ప్రధాని.. ఇస్రో తయారు చేసిన వ్యోంమిత్రతో ఇంటరాక్ట్‌ అయ్యారు.


ముగ్గురు వ్యోమగాములతో కూడి బృందం లో ఎర్త్‌ ఆర్బిట్‌లోనికి గగన్‌యాన్‌ మిషన్‌ తీసుకు వెళుతుంది. ఇది విజయవంతం అయితే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఆ ఘనత సాధించిన నాలుగవ దేశంగా భారత్‌ నిలుస్తుంది. మిషన్‌ విజయవంతం కావడంతోపాటు వ్యోమగాముల భద్రతను దృష్టిలో ఉంచుకుని గగన్‌యాన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నారు. లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్స్‌, కమ్యూనికేషన్ల వ్యవస్థ, అంతరిక్షంలో మానవుడు జీవించేందుకు అనువైన ఇతర అంశాలను స్పేస్‌క్రాఫ్ట్‌ కలిగి ఉంటుంది.