విధాత, మహాబూబ్‌నగర్ ప్రతినిధి: ఆక్టోబర్ 1న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరు గడ్డ నుంచే ఎన్నికల శంఖారావం మ్రోగిస్తారని బీజేపీ జాతీయ నాయకులు, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి వెల్లడించారు. శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నాహాకాల్లో భాగంగా పాలమూరు నుంచే ప్రధాని మోడీ బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్ ప్రభుత్వం పాలమూరు ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఎన్నికల వేళ హడావుడిగా పూర్తికాని పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన మరుసటి రోజు నుంచే మోటారు పనిచేయడం లేదన్నారు. మోడీ పాలనను ప్రపంచ దేశాలు సైతం మెచ్చుకుంటున్నాయని, ప్రపంచ దేశాల్లో భారతీయులు తలెత్తుకునే విధంగా దేశాన్ని అభివృద్ధి చేశారని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.
జీ20 సమావేశాలు, చంద్రయాన్ 3, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లాంటి అనేక విజయాలను సాధించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు.అలాంటి గొప్ప వ్యక్తి ప్రపంచ దేశాలలో సైతం ప్రఖ్యాతిగాంచిన మోడీ పాలమూరుకు రావడం ఇక్కడి ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
ఎన్నో ఏళ్లుగా అమలుకు నోచుకోని మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన తరువాత మొదటిసారి పాలమూరుకు రానున్న తరుణంలో మహిళల చేత ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపే కార్యక్రమం చేపడతామని ఆయన ప్రకటించారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్, మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజా రెడ్డి, ఎగ్గని నర్సింహులు, పడకుల బాలరాజు, సుదర్శన్ రెడ్డి, కొండయ్య, జలంధర్ రెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కృష్ణవర్ధన్ రెడ్డి, క్రిస్టియ నాయక్, పాల్గొన్నారు.