అది అంతా అవసరమా?’ విదేశాలకు వెళ్లి చేసుకునే వివాహాలపై మోదీ ఆవేదన
ఇటీవల కొంత మంది పేరున్న వాళ్లు అనుసరిస్తున్న డెస్టినేషన్ వెడ్డింగ్ (Modi On Destination Wedding) పోకడపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు

విధాత: ఇటీవల కొంత మంది పేరున్న వాళ్లు అనుసరిస్తున్న డెస్టినేషన్ వెడ్డింగ్ (Modi On Destination Wedding) పోకడపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం బయట వివాహాలు జరుపుకోవడం వల్ల సంపద అంతా అక్కడ ఉపయోగపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంత ఖర్చు పెట్టి విదేశాల్లో ఆ వేడుక జరుపుకోవడం అవసరమా అని ప్రశ్నించారు. ఆదివారం మన్ కీ బాత్ (Mann ki Bath) లో మాట్లాడిన ఆయన విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘కొన్ని రోజుల్లో వివాహాల పండగ మొదలు కానుంది.
ఆర్థిక సంస్థల అంచనాల ప్రకారం.. ఈ రోజుల్లో రూ.5 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల కొరకు అందరూ భారతీయ ఉత్పత్తులను కొనడానికి ప్రాధాన్యం ఇవ్వాలి’ అని సూచించారు. ‘వివాహం అనే అంశం చర్చకు వచ్చినప్పుడల్లా.. నా మనసును ఒక ప్రశ్న తొలుస్తూ ఉంటుంది. దానిని నా కుటుంబ సభ్యులైన మీతో కాకపోతే ఎవరితో పంచుకుంటాను? ఈ మధ్య కొన్ని ధనవంతుల కుటుంబాలు ఒక పోకడను ప్రారంభించాయి. విదేశాలకు వెళ్లి వివాహాలను ఘనంగా చేసుకుంటున్నారు.
ఇది అంతా అవసరమా’ అని ఆయన ప్రశ్నించారు. ఆ డబ్బు అంతా ఈ గడ్డపై ఖర్చు పెడితే.. మన శ్రమ దేశం దాటి పోదని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఆ వేడుకల్లో పని చేస్తూ ఉపాధి దక్కించుకునే అవకాశం మన యువతకు లభిస్తుందని.. ఆర్థిక వ్యవస్థకూ చక్కని దన్ను లభిస్తుందని పేర్కొన్నారు. ‘మీరు కోరుకుంటున్న వసతులు, మౌలిక సదుపాయాలూ ఈరోజు ఇక్కడ లేకపోవచ్చు. కానీ అలాంటి వేడుకలు కొన్ని ఇక్కడ ప్రారంభమైతే.. అన్నీ వాటికవే వస్తాయి’ అని విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
గత నెల రోజుల్లో దివాళీ, భయ్యా ధూజ్, ఛత్ వంటి పర్వదినాల్లో సుమారు రూ.4 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని .. తాను ఇచ్చిన ఓకల్ ఫర్ లోకల్ పిలుపుతో చాలా వరకు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే కొనుగోలు చేశారని మోదీ పేర్కొన్నారు. చిన్నారులు సహా ప్రతి ఒక్కరూ ఏదైనా కొనేటప్పుడు అది దేశీయ ఉత్పత్తా కాదా అనేది చూస్తున్నారని ఆయన అన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా భౌతికంగా డబ్బుతో లావాదేవీలు తగ్గిపోతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఒక నెల మొత్తం యూపీఐనే ఉపయోగిస్తామని అనుకుని దానిని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. ‘అలా చేశాక ఆ అనుభవాలను మీ ఫొటోలను నాతో పంచుకోవాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు.