Postal Accident Insurance | ధీమా ఇస్తున్న పోస్టల్ ప్రమాద బీమా.. దరఖాస్తు చేసిన పది రోజుల్లో రూ.10లక్షలు
Postal Accident Insurance మూడు కుటుంబాలకు అండగా నిలిచిన తపాల శాఖ దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే ఖాతాలలో రూ.10లక్షలు జమ విధాత బ్యూరో, కరీంనగర్: నిత్యం ఉత్తరాల బట్వాడా, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలతోనే కుస్తీ పట్టే తపాల శాఖ ప్రజలకు బాసటగా నిలవాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన ప్రమాద బీమా అనేక కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ప్రమాదాల బారినపడి ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతున్న వేళ తపాల శాఖ ఆ […]
Postal Accident Insurance
- మూడు కుటుంబాలకు అండగా నిలిచిన తపాల శాఖ
- దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే ఖాతాలలో రూ.10లక్షలు జమ
విధాత బ్యూరో, కరీంనగర్: నిత్యం ఉత్తరాల బట్వాడా, చిన్న మొత్తాల పొదుపు ఖాతాలతోనే కుస్తీ పట్టే తపాల శాఖ ప్రజలకు బాసటగా నిలవాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన ప్రమాద బీమా అనేక కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ప్రమాదాల బారినపడి ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతున్న వేళ తపాల శాఖ ఆ కుటుంబానికి ధీమానిస్తోంది.
కరీంనగర్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు ఈ ప్రమాద బీమా చేసుకుని మరణించిన ముగ్గురు వ్యక్తులు, ప్రమాదాల బారినపడి గాయాలతో చికిత్స పొందిన వారికి తపాల శాఖ క్లైమ్ అందించింది. దరఖాస్తు చేసిన పది రోజులలోనే రూ.10లక్షల మంజూరై నేరుగా నామిని బ్యాంక్ ఖాతాలో జమ అవుతుండటంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు తపాల శాఖ సేవలను అభినందిస్తున్నారు.

చొప్పదండికి చెందిన అనుమండ్ల రాజశేఖర్ రూ.399లతో తపాల ప్రమాద బీమా చేసుకున్నారు. ప్రమాద బీమా చేసుకున్న పక్షం రోజులకే రాజశేఖర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలాగే మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన రాజు, గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డిలు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
ఈ బాధిత కుటుంబాలు క్లైమ్ కోసం అప్లయ్ చేయగా, పది రోజుల్లోనే రూ.10లక్షలు వారి బ్యాంకు ఖాతాలలో జమ అయ్యాయి. ఇంటి పెద్ద మరణించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడే వేళ… తపాల శాఖ ప్రమాద బీమా ఆ కుటుంబానికి అండగా నిలుస్తోంది. వీరితోపాటు మరో ఐదుగురు గాయ పడి ఆసుపత్రిలో చికిత్స పొందగా, వారికి రూ.40వేల రూపాయలు మంజూరయ్యాయి.
ప్రమాద బీమాపై సత్వర సేవలను అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు స్పెషల్ క్యాంపెన్ నిర్వహిస్తున్నామని కరీంనగర్ నార్త్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్ పెక్టర్ పి.చంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. నార్త్ సబ్ డివిజన్లో ప్రమాద బారిన పడి ముగ్గురు మృతి చెందగా, వారి కుటుంబాలకు రూ.10లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకు నార్త్ సబ్ డీవిజన్ లో మొత్తం 15,769 మంది ప్రమాద బీమా చేసుకున్నారని వివరించారు. ప్రజల కోరిక మేరకు క్యాంపెన్ కొనసాగిస్తున్నామని, మీ దగ్గరలో ఉన్న పోస్టాఫీసులలో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రమోహన్ కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram