Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడోసారి సిట్ విచారణలో ప్రభాకర్ రావు

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు శనివారం మరోసారి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిన తర్వాత సిట్ విచారణకు హాజరవ్వడం ఇది మూడోసారి. ఇప్పటికే రెండుసార్లు సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారించిన సందర్భంగా సేకరించిన సమాచారం ఆధారంగా కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణిత్ రావును శుక్రవారం విచారించడం ద్వారా క్రాస్ చెక్ చేసుకున్నారు. ప్రణీత్‌రావు నుంచి నమోదు చేసిన వాంగ్మూలం ద్వారా ప్రభాకర్‌రావును మరోసారి ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్‌రావును కూడా ప్రభాకర్‌రావుతో కలిసి ప్రశ్నించనున్నారు. ప్రధానంగా వారిద్దరి విచారించే క్రమంలో ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు..? హార్డ్ డిస్క్‌లను ఎవరి ఆదేశాలతో ధ్వంసం చేయాల్సి వచ్చింది..? ఎంత మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. వారిలో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు..ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు? అనే కోణాల్లో సిట్ వారి నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంది.
ఈ కేసులో ఇప్పటికే ఏసీసీలు భుజంగరావు, తిరుపతన్న, డీసీసీ రాధాకిషన్ రావులను కూడా విచారించగా..వారి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కూడా ప్రభాకర్ రావును విచారించనున్నారు. ప్రణిత్ రావు విచారణ సందర్భంగా కొత్తగా బీజేపీ నేతలు ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమార్, మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు జితేందర్ రెడ్డిల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. కేసు విచారణ ముందుకు సాగుతున్న కొద్ధి ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు..ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసి..డబ్బులు పట్టుకున్నారన్న దానిపై మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూడనున్నాయంటున్నారు దర్యాప్తు బృందాలు.