PS 2 Review | విజువల్‌గా వండరే కానీ.. మణిరత్నం చేసిన బ్లండర్ ఇదే..
PS 2 Review చిత్రం పేరు: ‘పొన్నియిన్ సెల్వన్ 2’ విడుదల తేదీ: 28 ఏప్రిల్, 2023 నటీనటులు: చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మీ, శరత్ కుమార్, రెహమాన్ తదితరులు సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ స్ర్కీన్‌ప్లే: మణిరత్నం, జి. జయమోహన్, కుమర్‌వేల్ నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరణ్ దర్శకత్వం: మణిరత్నం తమిళ భాషలో మినహా.. విడుదలైన ఏ ఇతర భాషలో […]

PS 2 Review
చిత్రం పేరు: ‘పొన్నియిన్ సెల్వన్ 2’
విడుదల తేదీ: 28 ఏప్రిల్, 2023
నటీనటులు: చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మీ, శరత్ కుమార్, రెహమాన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
స్ర్కీన్‌ప్లే: మణిరత్నం, జి. జయమోహన్, కుమర్‌వేల్
నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరణ్
దర్శకత్వం: మణిరత్నం
తమిళ భాషలో మినహా.. విడుదలైన ఏ ఇతర భాషలో కూడా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ విజయం సాధించలేక పోయింది. అసలు ఇతర భాషల వాళ్లకి ఈ సినిమా అర్థమే కాలేదు. ఒకటి రెండు సార్లు చూసిన వాళ్లకి మాత్రం.. ఏదో కాస్త గుర్తుండి ఉంటుంది. కానీ తమిళ తంబీలు మాత్రం.. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడా?’ అన్నంత ఉత్కంఠగా ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.
‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా చేయడానికి, రెండు పార్ట్‌లుగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి.. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళినే కారణమని మణిరత్నం ప్రతి ప్రెస్‌మీట్‌లో చెబుతున్నప్పటికీ.. ఆయనలా సంవత్సరాలకీ సంవత్సరాలు టైమ్ తీసుకోకుండా.. రెండు పార్ట్‌లకు సంబంధించిన షూటింగ్‌ని ఆయన ముందే ముగించేశాడు. ఏవో చిన్న చిన్న ప్యాచ్ వర్క్‌లు మాత్రం ఈ గ్యాప్‌లో చేశాడు అంతే.
మొదటి పార్ట్ విడుదలైన.. కేవలం ఆరు నెలలలోనే రెండో పార్ట్‌ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన మణిరత్నం.. ఈ పార్ట్‌ను కూడా తమిళ తంబీలకే నచ్చేలా చేశాడా? ఇతర భాషల వారిని కూడా ఆకర్షించేలా ఏమైనా మార్పులు చేశాడా? కల్కి కృష్ణమూర్తి నవలకు మణిరత్నం పూర్తి స్థాయిలో న్యాయం చేశాడా? మొదటి పార్ట్‌తో తమిళ్‌లో రికార్డులను కొల్లగొట్టిన ఈ సినిమా.. ఈ పార్ట్‌తో మళ్లీ అటువంటి మ్యాజిక్‌ని క్రియేట్ చేయగలదా? అసలీ ‘పీఎస్ 2’ ఎలా ఉంది? అనే ప్రశ్నలకు మన రివ్యూలో సమాధానం తెలుసుకుందాం.
మొదటి పార్ట్ ముగింపులో.. చోళ యువరాజు అరుణ్ మొళి వర్మ (జయం రవి), వల్లవరాయన్ వంద్యదేవన్ (కార్తీ).. శత్రువులతో పోరాడుతూ.. సముద్రంలో మునిగిపోవడంతో ముగించారు. యువరాజు సముద్రంలో మునిగిపోవడంతో మధురాంతకుడు (రెహమాన్) పట్టపురాజు కావడానికి సగం అడ్డు తొలగిపోయినట్లుగా పెరియ పళవేట్టురాయన్ (శరత్ కుమార్) సమూహం భావిస్తుంటుంది.
కానీ, ఎప్పటిలానే అరుణ్ మొళి వర్మ కష్టంలో ఉన్న ప్రతిసారి కాపాడే మందాకిని.. సముద్రంలో చిక్కుకున్న అతని కోసం వెళుతున్నట్లుగా మొదటి పార్ట్‌లో చూపించారు. ఇక రెండో భాగాన్ని కూడా ఇదే సన్నివేశాన్ని కంటిన్యూ చేస్తూ కథని ప్రారంభించారు. మొదటి పార్ట్‌ని ఆసక్తికరంగా ముగించిన దర్శకుడు రెండో భాగానికి సంబంధించిన కథపై కూడా ఆసక్తిని కలిగించాడు.
ఆ ముగింపు ప్రకారం.. ఐశ్వర్యరాయ్ పోలికలతో ఉన్న ఆ వృద్దురాలు మందాకిని ఎవరు? ఆమె పొన్నియిన్ సెల్వన్‌ను కాపాడిందా? చోళ రాజ్యం అంతం కోసం చూస్తున్న పాండ్యులు ఎటువంటి యుక్తితో ముందడుగు వేశారు. పెరియ పళవేట్టురాయన్ సమూహం కోరుకున్నట్లుగా మధురాంతకుడు చోళ సింహాసనాన్ని అధిష్టించాడా? ఆదిత్య కరికాలుడిని రప్పించడానికి నందిని పన్నిన వ్యూహంలో పొన్నియిన్ సెల్వన్ సముద్రం పాలయితే.. ఆదిత్య కరికాలుడు ఏమయ్యాడు? నందిని వ్యూహం ఫలించిందా? వంటి ప్రశ్నలన్నింటికి విజువల్ వండర్‌గా మణిరత్నం ఇచ్చిన సమాధానమే ఈ సినిమా కథ.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
మొదటి పార్ట్‌లో కార్తీ పాత్రతో కథని నడిపించిన దర్శకుడు.. ఈ పాత్రలో మాత్రం ఆదిత్య, నందిని పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆదిత్యగా విక్రమ్ కనిపించేది కాసేపే అయినా.. ఆయన పాత్ర సినిమాపై మంచి ప్రభావం చూపిస్తుంది. ఐశ్వర్యరాయ్ ప్రతి స్టేజ్‌పై మణిరత్నం కాళ్లపై ఎందుకు పడుతుందో.. ఈ పార్ట్ 2 చూసిన వారికి అర్థమవుతుంది.
నందిని, మందాకినిగా ఐశ్వర్యరాయ్ పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు దర్శకుడు. ఐశ్వర్యరాయ్ ఈ పార్ట్‌లో చాలా బాగా మెప్పిస్తుంది. మొదటి పార్ట్‌తో పోలిస్తే కార్తీకి పెద్దగా స్కోప్ దొరకలేదు. కార్తీ పార్ట్ 1లో కాస్త ఎంటర్‌టైన్ చేస్తాడు. కానీ ఇందులో సీరియస్ మోడ్‌లోని అతని పాత్ర ఉంటుంది.
జయం రవికి కూడా అంత పెద్దగా పాత్రేం లేదు. యుద్ధానికి, రెండు మూడు సన్నివేశాలకు మాత్రమే అతనిని పరిమితం చేశారు. కుందవై పాత్రలో త్రిష.. మరోసారి అందంగా కనిపించి అలరించింది. ఇంకా ఐశ్వర్య లక్ష్మీ, శోభిత, శరత్ కుమార్, పార్తీబన్, రెహమాన్ వంటి వారు వారి పాత్రల పరిధిమేర నటించారు. ఈ పార్ట్‌లో కొన్ని కొత్త పాత్రలు కూడా దర్శనమిస్తాయి.
సాంకేతికంగా ఈ సినిమా హై లెవల్ ఉందని చెప్పుకోవచ్చు. మొదటి పార్ట్‌లానే ప్రతి ఒక్కరూ ఇందులో కూడా మంచి ఎఫర్ట్స్‌ని కనబరిచారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ రవి వర్మన్.. మణిరత్నం కలల ప్రాజెక్ట్‌కి ప్రాణం పోశాడు. నిజంగా 9వ శతాబ్ధం ఇలాగే ఉండేదా అని అనిపించేంతగా రవివర్మన్ కెమెరా ఈ సినిమాని చిత్రీకరించింది. పాటలు అంతగా ఎక్కేలా లేవు కానీ.. రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు. మూడ్‌కి తగిన సంగీతంతో సినిమా ఆహ్లాదకరంగా సాగింది.
సీనియర్ కళా దర్శకుడు తోట తరణి ఆర్ట్ వర్క్ ఈ సినిమాకు మరో ప్రాణం. ఎడిటింగ్ పరంగా కొన్ని సీన్లకు కత్తెర వేసే అవకాశం ఉంది కానీ.. ఆ నవలలోది ఏది మిస్ కాకుండా ఎక్కించాలనే ప్రయత్నంలో మణిరత్నం.. ఎడిటర్ చేతులు కట్టేసి ఉండవచ్చు. సినిమా చాలా స్లోగా.. నత్తనడక అంటారు కదా.. అలా నడిచింది. జయరామ్ పాత్రకి తనికెళ్ల భరణి డబ్బింగ్ చెప్పడమే కాకుండా.. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి డైలాగ్స్ రాసే బాధ్యతని తీసుకుని.. తెలుగు వారికి మ్యాగ్జిమమ్ అర్థమయ్యేలా చేయడానికి సాహసించాడు.
ఆయన కాకుండా వేరే వాళ్లు అయి ఉంటే మాత్రం సినిమా అంతా తమిళదనమే కనిపించేది. స్వయంగా నిర్మాత మణిరత్నమే కావడంతో పాటు, కోలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ లైకా కూడా చేతులు కలపడంతో చాలా ఉన్నతంగా, విజువల్‌గానూ అలరించేలా సినిమాకు ఖర్చు పెట్టారు. ఇక దర్శకుడిగా మణిరత్నం.. తన ప్రతిభను కనబరిచారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కి ఆయన ప్రాణం పోశారని చెప్పుకోవచ్చు.
విశ్లేషణ:
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ఆసక్తి.. పార్ట్ 2కి బీభత్సమైన కలెక్షన్స్‌ని తెచ్చిపెట్టింది. అయితే అది చందమామ కథలా సాగడంతో.. ప్రపంచం మొత్తాన్ని కనెక్ట్ చేయగలిగింది. కానీ ‘పొన్నియిన్ సెల్వన్’కు అదే మిస్సయింది. ఇది చందమామ కథ కాదు.. చోళుల కథ. 9వ శతకంలో చోళ సామ్రాజ్యంలో ఏం జరిగిందనేది చెప్పే కథ. ఈ కథకి సినిమాటిక్ లిబర్టీని వాడకుండా.. నవలలో కల్కి కృష్ణమూర్తి ఎలా రాస్తే అలా తెరకెక్కించడంతో.. ఇది అందరికీ కనెక్ట్ కాలేకపోయింది.
కానీ తమిళులకు మాత్రం ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే మొదటి పార్ట్‌కి కనకవర్షం కురిపించారు. ఇప్పుడీ రెండో పార్ట్ కూడా వారికి బాగా నచ్చే అవకాశముంది. ఇతర భాషల వారిని మాత్రం మరోసారి మణిరత్నం గందరగోళానికి చేసేశాడనే అనిపిస్తుంది. కానీ.. ఈ నవల గురించి తెలిసిన వారికి, అలాగే చోళ సామ్రాజ్యం గురించి తెలిసిన ఇతర భాషల వారిని కూడా ఈ సినిమా మెప్పిస్తుంది.
మొదటి పార్ట్‌లోలానే ఇందులోనూ పాత్రల పేర్లు, ఊర్ల పేర్లు చూస్తున్న ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తాయి. అలాగే ఆదిత్య, నందిని యవ్వనంలో ఉండగా ఏం జరిగిందనే క్లారిటీని ఇందులో కూడా దర్శకుడు చెప్పలేదు. ఇంకా మందాకిని పాత్రని రివీల్ చేసిన తర్వాత.. ఆ పాత్రకి సుందరచోళుడు (ప్రకాశ్ రాజ్) చేసిన అన్యాయం ఏమిటనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు.
మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో.. అసలు కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు.. తెరపై ఏదో అద్భుతం జరుగుతున్నట్లుగా అయితే చేయగలిగాడు కానీ.. ఆ అద్భుతం ఏమిటనేది మాత్రం ప్రేక్షకుడు గ్రహింప లేకుండా చేశాడు. బాహుబలి తరహాలో యుద్ధ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. అంత ఎఫెక్టివ్‌గా అనిపించ లేదు. బహుశా.. బాహుబలిలో చూసేసి ఉండటం కారణంగా కనెక్ట్ కాలేదనుకోవాలి. ముగింపు సన్నివేశాలు మాత్రం మంచి ఫీలింగ్‌ని ఇస్తాయి.
ఓవరాల్‌గా అయితే మళ్లీ ఈ సినిమా తమిళ ప్రేక్షకుల కోసమనే చెప్పుకోవాలి. అందరికీ నచ్చేలా, మెచ్చేలా మణిరత్నం మలచలేదని ఒప్పుకోవాలి. కాకపోతే.. బాహుబలిలో లానే రాజ్యం, రాజ్యాధికారం కోసం శత్రువులు, పక్కన ఉండే సొంత మనుషులు ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు చేయడానికైనా వెనుకాడరనేది.. ఈ చిత్రంలో కూడా కనిపిస్తుంది.
అలాగే ఆ సినిమాలోలానే ప్రేమించుకుని దూరమైతే పడే సంఘర్షణ, త్యాగాలు, వీరోచిత సాహసాలు వంటివి ఇందులోనూ అంతర్లీనంగా దాగి ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ‘బాహుబలి’ వంటి కథే ఇందులో ఉన్నా.. పాత్రలు ఎక్కువగా ఉండటంతో పాటు, ఆ పాత్రలకు సంబంధించిన నేపథ్యం ప్రేక్షకులకి తెలియకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. అందుకే అందరిది అనుకోవాల్సిన ఈ సినిమా కొందరికే చేరింది.. చేరుతుంది.
ట్యాగ్‌లైన్: విజువల్‌గా వండరే కానీ.. మణిరత్నం చేసిన బ్లండర్ ఇదే..
రేటింగ్: 2.75/5