స్నేహితుడికి శుభాలు క‌లుగు గాక‌.. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను ఉద్దేశించి జైశంక‌ర్‌తో పుతిన్‌

ఇరు దేశాల‌ మ‌ధ్య సంబంధాలను బ‌లోపేతం చేసుకునే క్ర‌మంలో భాగంగా భార‌త విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ర‌ష్యాలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే

  • By: Somu    latest    Dec 28, 2023 10:27 AM IST
స్నేహితుడికి శుభాలు క‌లుగు గాక‌.. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను ఉద్దేశించి జైశంక‌ర్‌తో పుతిన్‌

ఇరు దేశాల‌ మ‌ధ్య సంబంధాలను బ‌లోపేతం చేసుకునే క్ర‌మంలో భాగంగా భార‌త విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ర‌ష్యా (Russia) లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయిదు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తొలిరోజు ర‌ష్యా విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రితో భేటీ అయిన ఆయ‌న .. అనూహ్యంగా ఆ దేశాధ్య‌క్షుడు పుతిన్‌ (Putin) తోనూ ముఖాముఖి చ‌ర్చించారు. అత్య‌వ‌స‌ర‌ ప‌రిస్థితుల్లో త‌ప్ప దేశాధ్య‌క్షులు మ‌రో దేశ మంత్రితో నేరుగా మాట్లాడ‌రు. కాబ‌ట్టి జైశంక‌ర్‌, పుతిన్‌ల మ‌ధ్య కీల‌క చ‌ర్చ‌లే జ‌రిగాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జైశంక‌ర్‌తో సంభాషిస్తూ పుతిన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.


త‌న స్నేహితుల‌కు విజయాలు క‌ల‌గాల‌ని, ఇరు దేశాల మ‌ధ్యా సంప్ర‌దాయంగా ఉన్న స్నేహం కొన‌సాగాల‌ని పుతిన్ వ్యాఖ్యానించారు. మ‌రో రెండు మూడు నెల‌ల్లో భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే ఆయ‌న ఈ విధంగా పేర్కొన్నారు. రాజ‌కీయంగా ప‌రిస్థితులు ఎలా ఉన్నా ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు దృఢంగా ఉండాల‌ని ఆకాంక్షిస్తున్నాన‌న్నారు. వ‌చ్చే ఏడాది మోదీ ర‌ష్యాలో ప‌ర్య‌టించాల‌ని ఆహ్వానిస్తున్న‌ట్లు జైశంక‌ర్‌కు పుతిన్ తెలిపారు. ‘ఉక్రెయిన్ సంక్షోభం గురించి తాము ఇద్ద‌రం ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.


మేము ఇద్ద‌రం చాలా సార్లు మాట్లాడుకుంటాం. ఉక్రెయిన్ ప‌రిస్థితిపై మోదీకి చాలా సార్లు స‌మాచారం ఇచ్చాను. సంక్షోభానికి శాంతియుతంగా ముగింపు పలికేలా కృషి చేయ‌డానికి ఆయ‌న ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు’ అని మోదీని ఉద్దేశించి పుతిన్ అన్నారు. ప్ర‌పంచ రాజ‌కీయాల్లో ఎన్ని మార్పులు వ‌చ్చినా.. భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య సంబంధాలు అత్యంత దృఢంగా ఉండ‌ట‌మే కాకుండా కొత్త ఎత్తుల‌ను చేరుకుంటున్నాయ‌ని పుతిన్ అభిప్రాయ‌ప‌డ్డారు. ‘భార‌త ప్ర‌ధాని, మా స్నేహితుడు మోదీ ర‌ష్యాలో ప‌ర్య‌టించాల‌ని మేము మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ ప‌ర్య‌ట‌న‌లో అన్ని విష‌యాల‌ను చ‌ర్చిస్తాం’ అని పేర్కొన్నారు.


వ‌చ్చే ఏడాది భార‌త్ రాజ‌కీయంగా ఎంతో బిజీగా ఉంటుంద‌ని అయినా మోదీ ర‌ష్యాలో ప‌ర్య‌టించ‌డం చూడాల‌ని ఉందంటూ పుతిన్ చ‌మ‌త్క‌రించారు. కాగా ర‌ష్యా, ఉక్రెయిన్ ల మ‌ధ్య సంక్షోభం మొద‌లైన‌ప్ప‌టి నుంచి భార‌త్ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం తెలిసిందే. ఒక ర‌కంగా ర‌ష్యా వెనుకే నిల‌బ‌డిన‌ట్లు మ‌న విధానం సాగింది. ర‌ష్యాను దెబ్బ‌తీద్దామ‌ని ఆ దేశం నుంచి అమెరికా, దానిమిత్ర దేశాలు దిగుమ‌తుల‌ను నిలిపివేసిన స‌మ‌యంలో భార‌త్ విరివిగా చ‌మురు కొని ర‌ష్యాను ఆదుకుంది. అయితే ఉక్రెయిన్‌పై యుద్ధం స‌రైన‌ది కాదని పుతిన్‌కు మోదీ సూచించారు. ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని పుతిన్‌తో మోదీ అన్న వ్యాఖ్య కూడా ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది.