వానాకాలం సాధారణం.. ముగిసిన రుతుపవన సీజన్

- ఎల్ నినో ఉన్నప్పటికీ
- సగటు వర్షపాతం నమోదు
- 73 శాతం ప్రాంతాల్లో సాధారణం
- 18% ప్రాంతాల్లో లోటు వర్షపాతం
- ఐఎండీ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ : నాలుగు నెలల రుతుపవన సీజన్.. అస్తవ్యస్థ వాతావరణ పరిస్థితుల మధ్య, ఎల్‌నినో ఉన్నప్పటికీ సాధారణం వర్షపాతంతో ముగిసింది. దీర్ఘకాలిక సగటు 868.6 మిల్లీమీటర్లకు గాను.. భారతదేశం 820 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతాన్ని నమోదు చేసిందని భారత వాతావరణ విభాగం శనివారం ప్రకటించింది. దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ)లో 94%-106% మధ్య వర్షపాతం నమోదైతే దానిని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు.
అయితే.. ఇది ఆయా ప్రాంతాల్లో నమోదైన వర్షపాతాన్ని క్రోడీకరించినదే కానీ.. దేశవ్యాప్తంగా ఇదే స్థాయిలో వర్షం పడినట్టు కాదు. ఎల్‌నినో ప్రతికూలతలను అధిగమించి కూడా ఈ ఏడాది రుతుపవన సీజన్ 94.4 శాతం వర్షపాతంతో సాధారణంగా ముగిసిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు. ఇందులో 73శాతం ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం ఉంటే.. 18 శాతం ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైందని శనివారం మీడియా సమావేశంలో తెలిపారు.
తూర్పు, ఈశాన్య భారతదేశంలో సాధారణ స్థాయి 1367.3 అయితే.. 1115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది. అంటే ఈ ప్రాంతాల్లో 18శాతం లోటు నమోదైంది. వాయవ్య భారతదేశంలో సగటు వర్షపాతం 587.6 మిల్లీమీటర్లకు గాను 593 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వర్షాధార వ్యవసాయం ఎక్కువగా సాగే మధ్యభారతదేశంలో సాధారణ సగటు 978 మిల్లీమీటర్లకు గాను.. 981.7 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. దక్షిణాదిలో 8 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
రుతుపవ సీజన్ ప్రారంభానికి ముందు ఈ సీజన్‌లో సాధారణ వర్షాలే ఉంటాయని, కాకపోతే సాధారణ స్థాయిలో దిగువన ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవన సీజన్ రెండో అర్ధభాగంలో దక్షిణమెరికా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో జలాలు వేడెక్కి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలు లేకపోలేదని కూడా హెచ్చరించింది. ఎల్ నినో పరిస్థితులు రావడం అంటే.. బలహీనమైన రుతుపవనాలు, పొడివాతావరణం నెలకొనడం.
ఈ ఏడాది జూన్‌లో దేశం తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొన్నది. కనీవినీ ఎరుగని రీతిలో 1901 తర్వాత వానల్లేని నెలగా ఆగస్ట్.. నిలిచిపోయింది. దీంతో ఎల్‌నినో పరిస్థితులు బలపడ్డాయి. అయితే.. సెప్టెంబర్ నెలలో మాత్రం అనేక అల్పపీడన ద్రోణులు ఏర్పడటంతో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురిశాయి.