Rajamouli-Mahesh Movie: రాజమౌళి-మహేష్ మూవీకి రూ. 50 కోట్లతో భారీ సెట్ !

రామోజీ ఫిలిం సిటీలో కొలువుతీరనున్న వారణాసి
విధాత : దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఎస్ఎస్ఎంబీ 29(SSMB29) సినిమా చిత్రీకరణ కోసం ఏకంగా. రూ.50కోట్లతో సెట్ వేస్తుండటం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఈ భారీ సెట్ వేస్తున్నారు. ఈ సినిమాలోని సన్నివేశాల కోసం వారణాసి(కాశీ) నగరాన్ని ఇక్కడ సృష్టిస్తున్నారు. సెట్ లో శివుడి ఆలయంతో పాటు పలు మండపాలు, కాశీ రోడ్లు, గంగా నది, గంగా హారతి వేదిక సెట్లు నిర్మిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ మోహన్ బింగి ఆధ్వర్యంలో దాదాపు రూ. 50 కోట్ల ఖర్చుతో వారణాసి సెట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో బాహుబలి సినిమా కోసం మాహిష్మతి సామ్రాజ్యాన్ని రామోజీ ఫిలీం సిటీలో సృష్టించిన రాజమౌళి ఈ దఫా మహేష్ సినిమా కోసం వారణాసి నగరాన్ని సృష్టిస్తుండటం విశేషం.
మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహా కథతో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ కెన్యాలో జరగనుంది. ఫారెస్ట్ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తారని తెలుస్తోంది. దీని తర్వాత వారణాసి సెట్ లో షూటింగ్ జరిగే అవకాశముందని సమాచారం. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ వైడ్ గా సత్తా చాటిన రాజమౌళి.. ఇప్పుడు మహేష్ సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్లబోతున్నారు. కె.ఎల్. నారాయణ ఇండియా సినీ చరిత్రలోనే దాదాపుగా రూ.1000కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.