Medak: మ‌ళ్ళీ తెర‌పైకి రామాయంపేట నియోజ‌క‌వ‌ర్గం!

సీఎం అంజయ్య ప్రాతినిధ్యం వహించిన రామాయంపేట 1952 నుండి… 2009 వరకు నియోజ‌క‌వ‌ర్గంగా ఓ వెలుగు.. ఆపై డిలిమిటేషన్‌లో రద్దు.. అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన రామాయంపేట… రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఉధృతంగా ఉద్యమం.. కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం…. విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్(Medak) ఉమ్మడి జిల్లాలో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం(Constituency)రామాయంపేట(Ramaym peta). ఈ నియోజక వర్గం 1952లో ఏర్పాటు కాగా 2009లో జరిగిన డీలిమిటేషన్(Delimitation)ప్రక్రియలో భాగంగా రద్దయింది. రామాయంపేట నియోజక వర్గంలోని చేగుంట, చిన్నశంకరంపేట, […]

Medak: మ‌ళ్ళీ తెర‌పైకి రామాయంపేట నియోజ‌క‌వ‌ర్గం!
  • సీఎం అంజయ్య ప్రాతినిధ్యం వహించిన రామాయంపేట
  • 1952 నుండి… 2009 వరకు నియోజ‌క‌వ‌ర్గంగా ఓ వెలుగు..
  • ఆపై డిలిమిటేషన్‌లో రద్దు..
  • అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన రామాయంపేట…
  • రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఉధృతంగా ఉద్యమం..
  • కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం….

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్(Medak) ఉమ్మడి జిల్లాలో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం(Constituency)రామాయంపేట(Ramaym peta). ఈ నియోజక వర్గం 1952లో ఏర్పాటు కాగా 2009లో జరిగిన డీలిమిటేషన్(Delimitation)ప్రక్రియలో భాగంగా రద్దయింది. రామాయంపేట నియోజక వర్గంలోని చేగుంట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, కొల్చారం, రామాయంపేట మండలాల‌తో పాటు మెదక్ మండలంలోని 10 గ్రామాలను కలుపుకొని రామాయంపేట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.

రామాయంపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకుని రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. దివంగత ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య ప్రాతినిధ్యం వహించడంతో అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో రామాయంపేట ప్రత్యక గుర్తింపు పొందింది. స్వాతంత్య్రం అనంతరం జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులను ఆదరించి ఇక్కడి ఓటర్లు తమ చతురతను చాటుకున్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో వరుసగా ఎన్నికైన అభ్యర్థులు తక్కువే. కాంగ్రెస్, కమ్యూనిస్టు, బిజెపి, టిడిపి, టిఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఒక మారు స్వతంత్ర అభ్యర్థికి సైతం ప్రాతినిధ్యం కల్పించి శాసనసభకు ఇక్కడి నియోజకవర్గ ప్రజలు పంపారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా 16 మంది పాలించగా ఇందులో రెడ్డి రత్నమ్మ, టి అంజయ్య, ఏ విట్టల్ రెడ్డి రెండు మార్లు గెలుపొందారు.

10 గ్రామాలను మెదక్ నియోజకవర్గంలో..

రామయంపేట స్వాతంత్య్రానికి పూర్వమే తాలూకాగా గుర్తింపు పొందినప్పటికీ 1952 నాటికీ మొదటి అసెంబ్లీ నియోజకవర్గంగా రూపొందించారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో వలస అభ్యర్థిగా లక్ష్మీ నిహాస్ గనేరి వాల ఇక్కడ జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం ఆయనపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి భూమా జి వేసిన కేసు కారణంగా ఎమ్మెల్యే పదవిని కోల్పోవలసి వచ్చింది. ఈ కారణంగానే జరిగిన ఉప ఎన్నికల్లో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు నల్గొండ జిల్లాకు చెందిన ఆరుట్ల రామచంద్రారెడ్డి పిడిఎఫ్ అభ్యర్థిగా గెలుపొందారు. ఒకటి 11, 1956 ఆంధ్రప్రదేశ్ అవతరించి జిల్లా స్వరూపం మారగా నియోజకవర్గంలో కూడా రూపురేఖలు మార్పు చెందాయి. అప్పట్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న రామాయంపేట నియోజకవర్గంలోని 10 గ్రామాలను మెదక్ నియోజకవర్గంలో కలిపారు.

కమ్యూనిస్టుల బలానికి అడ్డుకట్ట

మెదక్ నియోజకవర్గంలోని మెదక్ మండలంలో సగభాగం గ్రామాలను రామయంపేట్ నియోజకవర్గంలో విలీనం చేసి కమ్యూనిస్టుల బలానికి అడ్డుకట్ట వేయడం కోసం నియోజకవర్గాన్ని చిందరవందరగా నిర్మించారు. చిన్న శంకరం పేట, చేగుంట, వెల్దుర్తి, కొల్చారం పూర్తి గ్రామాలు మెదక్ రామయంపేట మండలాల్లోని కొన్ని గ్రామాలతో రామాయంపేట నియోజకవర్గం ఏర్పాటు చేశారు. 1957 లో జరిగిన ఎన్నికల్లో ఆర్ నరసింహ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. 1962..67 జరిగిన ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి రత్నమ్మ గెలుపొందారు 1972లో జరిగిన ఎన్నికల్లో రెడ్డి రత్నమ్మ పై మొదటిసారి ఇండిపెండెంట్ అభ్యర్థి మాధవ రెడ్డి గారి కొండలరెడ్డి విజయం సాధించి సంచలనం సృష్టించారు.

టంగుటూరి అంజయ్య ఏకగ్రీవం

1978లో జాతీయ కాంగ్రెస్ చీలిపోగా కాంగ్రెస్ అభ్యర్థి చందంపేట విట్టల్ పై ఇందిర కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ ముత్యంరెడ్డి గెలుపొందారు. ఆయన 1981లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానం కల్పించడం కోసం తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఉప ఎన్నికల్లో టంగుటూరి అంజయ్య ఏకగ్రీవంగా రామాయంపేట ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. 1983లో సినీ నటుడు నందమూరి తారక రామారావు టిడిపి పార్టీని స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ప్రభంజనం వీస్తుండగా రామయంపేటలో మాత్రం ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య టిడిపి అభ్యర్థి తాళ్ళ కిష్ట గౌడ్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. 1985 లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రామన్నగారు వాసురెడ్డి గెలుపొందారు. 1989 ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఆర్ ముత్యంరెడ్డిని కాదని స్వయాన బావమరిది ఏ విట్టల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించారు. వాసిరెడ్డి పై ఏ విటల్ రెడ్డి ఘన విజయం సాధించారు.

రామయంపేట నియోజకవర్గం రద్దు..

1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విట్టల్ రెడ్డి టిడిపి అభ్యర్థి దేవర వాసుదేవ పై ఓటమి చెందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో అన్యంగా దేవర వాసుదేవరావు పై కాంగ్రెస్ అభ్యర్థి విట్టల్ రెడ్డి విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్ పొత్తుల భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి టిడిపి అభ్యర్థి మైనంపల్లి వాణి పై గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో రామాయంపేటకు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి పై ఘన విజయం సాధించారు. 2009 డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా రామయంపేట నియోజకవర్గం రద్దయింది.

రామాయంపేట నియోజకవర్గం ముక్కలు చెక్కలు

రద్దయిన రామయంపేట్ నియోజకవర్గం ముక్కలు చెక్కలైంది. కోల్చారం, వెల్దుర్తి మండలాలు నర్సాపూర్ నియోజక వర్గంలో విలీనం కాగా, రామాయంపేట, చిన్న శంకరంపేట మండలాలను
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో విలీనం చేశారు. చేగుంట మండలాన్ని దుబ్బాక నియోజకవర్గం లో విలీనం చేశారు.

మళ్ళీ తెరపైకి… రామాయంపేట నియోజకవర్గం..

మళ్ళీ తెరపైకి రామయంపేట నియోజకవర్గం వస్తోంది. ఉమ్మడి రామాయంపేట, నిజాంపేట, నార్సింగి, చేగుంట లేదా చిన్న శంకరంపేట మండలాన్ని కలుపుకొని రామయంపేట నియోజకవర్గం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి విజ్ఞప్తి చేస్తుంది. ఈ మేరకు రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, సుంకోజి దామోదర్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. రెవిన్యూ డివిజన్ సాధన సమితి తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. రెవెన్యూ డివిజన్ సాధన సాధ్యమైతేనే రామాయంపేట నియోజకవర్గం సాధ్యమవుతుందని ఈ ప్రాంత ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఆ దిశగా ఉద్యమం ఉధృతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు.