ఏసీబీ కోర్టు జడ్జిపై పోస్టులు.. రాష్ట్రపతి భవన్ సీరియస్!
- ఏపీ సీఎస్‌కు రాష్ట్రపతి భవన్ లేఖ
విధాత: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్, పోలీస్ రిమాండ్ ను కోర్టు అంగీకరించడం.. ఆ తరువాత అయన వేసుకున్న క్వాష్ పిటిషన్ ను హై కోర్టు కొట్టేయడం వంటి పరిణామాలు సైతం రాజకీయ పార్టీలు.. వాటి అనుబంధ సోషల్ మీడియా గ్రూపులకు ప్రధాన వార్తా వనరులుగా మారాయి.
దీంతో కోర్టు తీర్పులు.. జడ్జీలను సైతం తమ వార్తలు.. సోషల్ మీడియా పోస్టులకు వేదికలుగా మార్చుకుంటున్నారు. చంద్రబాబు జైలు నేపథ్యంలో టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలు సీఐడీ కేసులు వాదిస్తున్న జడ్జి దగ్గర్నుంచి అయన క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన హై కోర్ట్ జడ్జిని సైతం టార్గెట్ చేసి ఇష్టానుసారం పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.
అసభ్యపదజాలంతో వారిని అవమానపరుస్తూ పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇలాంటి చర్యలను కట్టడి చేయాలంటూ దీనిమీద పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లాయర్ రామానుజరావు ఏకంగా రాష్ట్రపతి భవన్ కు ఈ- మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన రాష్ట్రపతి భవన్ అధికారులు ఏపి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాశారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న మేరకు నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో రాష్ట్రపతి భవన్ కోరింది. దీంతో ఇప్పుడు పోలీసులు ఇలా పోస్టులు పెట్టేవారిని వెతుకులాడుతున్నారు. వారిమీద సైతం చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram