PayTm | పేటీఎంపై ఆర్బీఐ కొరడా
ఇది పేటీఎం కాదు, పే టు మోదీ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 2016 లోనే వ్యాఖ్యానించారు. ఆ మాటలే ఇప్పుడు రుజువవుతున్నాయి.

- ఫిబ్రవరి 29 నుంచి లావీదేవీలు బంద్
- రిజర్వ్ బ్యాంకు ఆదేశం
PayTm | న్యూఢిల్లీ: ఇది పేటీఎం కాదు, పే టు మోదీ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 2016 లోనే వ్యాఖ్యానించారు. ఆ మాటలే ఇప్పుడు రుజువవుతున్నాయి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 35ఎ ప్రకారం పేటీఎం ఫిబ్రవరి 29 నుంచి అన్ని కార్యకలాపాలు ఆపివేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక పేటీఎంపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు రిజర్వు బ్యాంకు ప్రకటించింది.
బ్యాంకింగ్ నియమాలను పాటించకపోవడం, పర్యవేక్షణ ప్రమాణాలను అనుసరించకపోవడం, ఇతర సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నది. డిపాజిట్లు సేకరించడం లేక టాప్ అప్స్ ఇవ్వడం ఫిబ్రవరి 29 నుంచి నిలిపివేయవలసి ఉంటుంది. సమగ్రమైన ఆడిటింగ్ తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వు బ్యాంకు తెలిపింది.
డిపాజిట్లు చేయవద్దని, క్రెడిట్ కార్యకలాపాలు కూడా నిలిపివేయాలని రిజర్వు బ్యాంకు కోరింది. అయితే పేటీఎం బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ అయిపోయే దాకా ఉపయోగించుకోవడానికి, ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుందని రిజర్వు బ్యాంకు పేర్కొంది. గత మార్చిలోనే కొత్త వినియోగదారులను తీసుకోవద్దని రిజర్వు బ్యాంకు పేటీఎంను ఆదేశించింది.
ఆ ఆదేశాలకు కొనసాగింపుగానే ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నది. కొత్త కస్టమర్లను తీసుకోవద్దు. పాత కస్టమర్లు ఆఫ్ లైన్, ఆన్ లైన్ సేవలను పొందవచ్చు. పేమెంట్ గేట్‌వే కూడా పనిచేస్తుంది. ఆఫ్‌లైన్ మర్చంట్ పేమెంట్ సేవలు కొనసాగుతాయి. బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన సేవలు ఫిబ్రవరి 29 తర్వాత కొనసాగించడానికి వీలు లేదు.
మోడీకి శుభాకాంక్షలు: పేటీఎం
డీమానిటైజేషన్ ప్రకటన వచ్చిన రోజే మోదీకి శుభాకాంక్షలు చెబుతూ పేటీఎం అన్ని ఆంగ్ల పత్రికల్లో ఒక ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చింది. అబ్ ఏటీఎం నహీ పేటీఎం కరో అంటూ ఈ ప్రకటనలో పేర్కొంది. ఆ సమయంలోనే రాహుల్ గాంధీ ఇది పేటీఎం కాదు పేటు మోదీ అని విమర్శ చేశారు.