రామమందిరం ప్రాణప్రతిష్ఠ.. 22న సెలవు ప్రకటించిన రిలయన్స్
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో జనవరి 22న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి

ముంబై : అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో జనవరి 22న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. పలు సంస్థలు కూడా తమ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా చేరింది. దేశ వ్యాప్తంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్యాలయాలకు జనవరి 22న సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది.
ఈ మహత్తర వేడుకకు దాదాపు 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ అథితుల జాబితాలో ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, బ్యూరోక్రాట్లు, దౌత్యవేత్తలు ఉన్నారు. రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కోడలు శ్లోకా, కాబోయే మరో కోడలు రాధిక మర్చంట్ హాజరు కానున్నారు.
అసోం, మధ్యప్రదేశ్, హర్యానా, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 22న మధ్యాహ్నం 2:30 గంటల వరకు సెలవులు ప్రకటించాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు, కేంద్ర విద్యాసంస్థలకు కూడా కేంద్రం జనవరి 22న సెలవు ప్రకటించింది.
ఇక రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.