ఎన్టీఆర్ ఘాట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు

దివంగత మాజీ సీఎం నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు చర్చనీయాంశమైంది

ఎన్టీఆర్ ఘాట్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు
  • బాలకృష్ణ ఆదేశాలతోనే తొలగింపు


విధాత : దివంగత మాజీ సీఎం నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు చర్చనీయాంశమైంది. గురువారం ఉదయమే జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చి నివాళులర్పించి వెళ్లారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్.. సీఎం సీఎం అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేశారు.


జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు వెళ్లిపోయిన అనంతరం సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కి వచ్చి నివాళులర్పించారు. బాలకృష్ణ వెళ్ళాకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ అక్కడి నుంచి వెళుతూ అనుచరులతో ఆ ఫ్లెక్సీలను తీయించెయ్.. ఇప్పుడే అంటూ చెప్పిన వీడియో క్లిప్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పెట్టిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం జరిగింది. ఈ ఫ్లెక్సీల తొలగింపు వివాదం నందమూరి కుటుంబం లోని విభేదాలకు నిదర్శనంగా కనిపించిందని అభిమానులలో, రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చలకు తెరలేపింది.