పౌర‌స‌మాజంపై న‌దుల ప‌రిర‌క్ష‌ణ బాధ్య‌త: వేద కుమార్‌

  • Publish Date - September 24, 2023 / 12:45 PM IST
  • ఫోర‌మ్ ఫ‌ర్ బెట‌ర్ హైద‌రాబాద్ చైర్మ‌న్ వేద కుమార్‌

విధాత‌, హైద‌రాబాద్‌: న‌దులు కాలుష్యం బారిన ప‌డ‌కుండా చూడాల్సిన బాధ్య‌త పౌర స‌మాజంపై ఉంద‌ని ఫోర‌మ్ ఫ‌ర్ బెట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షులు ప్రొఫెస‌ర్ వేద‌కుమార్ అన్నారు. ఆదివారం ప్ర‌పంచ న‌దుల దినోత్స‌వం సంద‌ర్భంగా దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ మరియు జెబిఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్, హైదరాబాద్ సహకారంతో మూసీ న‌ది సంద‌ర్శ‌న కార్య‌క్ర‌మాన్ని మంచిరేవుల బ్రిడ్జి వ‌ద్ద‌ చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో మూసీ న‌ది ఫోటో ఎగ్జిబిష‌న్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నదిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వంపై మాత్రమే లేదని, పౌరసమాజం, సంస్థలు ఈ లక్ష్యంతో సమానంగా నిమగ్నం కావాల్సిన అవసరం ఉందన్నారు. కౌన్సిలర్ నాగపూర్ణ మాట్లాడుతూ మూసీ నది పరిరక్షణలో తన వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎఫ్.బి.హెచ్ జనరల్ సెక్రటరీ శోభాసింగ్, ఉపాధ్యక్షులు ఎం.హెచ్.రావు, జె.బి.ఆర్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయుల‌తో పాటు స్థానికులు, ప‌లువురు ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు పాల్గొన్నారు.