అనుకున్నదే అమలు చేస్తున్న రేవంత్.. మాటల తూటాలు

కాంగ్రెస్ బలోపేతం దిశగా జోడో యాత్ర పట్టున్న ప్రాంతాల్లో మొదట కేంద్రీకరణ అధికార పార్టీ, అసమ్మతి రేవంత్ లక్ష్యం ఈ సెగ్మెంటల్లో కాంగ్రెస్‌ బలంగా ఉంది అనుకున్నదే అమలు చేస్తున్నారా? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టున్న ప్రాంతాల్లో పునాదులు మరింత బలోపేతం చేయాలని లక్ష్యంతో ఆ పార్టీ ఎన్నికలకు ముందస్తు అడుగులు వేస్తున్నట్లు భావిస్తున్నారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్ర సందర్భంగా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తొలి అడుగులు […]

అనుకున్నదే అమలు చేస్తున్న రేవంత్.. మాటల తూటాలు
  • కాంగ్రెస్ బలోపేతం దిశగా జోడో యాత్ర
  • పట్టున్న ప్రాంతాల్లో మొదట కేంద్రీకరణ
  • అధికార పార్టీ, అసమ్మతి రేవంత్ లక్ష్యం
  • ఈ సెగ్మెంటల్లో కాంగ్రెస్‌ బలంగా ఉంది
  • అనుకున్నదే అమలు చేస్తున్నారా?

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టున్న ప్రాంతాల్లో పునాదులు మరింత బలోపేతం చేయాలని లక్ష్యంతో ఆ పార్టీ ఎన్నికలకు ముందస్తు అడుగులు వేస్తున్నట్లు భావిస్తున్నారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్ర సందర్భంగా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తొలి అడుగులు వీటిని సూచిస్తున్నాయి.

ఎంతోకాలంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గాలుగా భావిస్తున్న సెగ్మెంట్లలో యాత్ర చేపట్టడం ద్వారా ఉన్న పార్టీ శక్తులను సంఘటితం చేసుకోవడమే కాకుండా నూతన ప్రాంతాలకు కొత్త ఉత్తేజాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తగిన ప్రణాళికతో రేవంత్ రెడ్డి ఒక్కో అడుగు వేస్తున్నట్లు భావిస్తున్నారు.

అధికారపార్టీ, అసమ్మతి రేవంత్ లక్ష్యం

అధికార గులాబీ పార్టీ, కాంగ్రెస్‌లోని అసమ్మతి లక్ష్యంగా రేవంత్ తొలి విడత హాత్‌సే హాత్‌జోడో యాత్ర సాగుతోంది. అటు పార్టీలోని అసమ్మతి వర్గాలకు, ఇటు విపక్షాలకు తగిన గుణపాఠం చెబుతూ సక్సెస్ ఫుల్‌గా యాత్ర చేపట్టే ప్రణాళికతో రేవంత్ వర్గం ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ముందస్తు కసరత్తు సాగినానంతరమే రేవంత్ రెడ్డి మేడారం నుంచి తన యాత్ర ప్రారంభించేందుకు సంసిద్ధమైనట్లు భావిస్తున్నారు.

ఆత్మీయ సోదరి సీతక్క

ములుగులో తనకు అత్యంత ఆత్మీయ సోదరిగా భావించే ధనసరి సీతక్క ఈ ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం సెంటిమెంట్‌గా భావించినట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు ఇక్కడ ఉన్నందున యాత్ర భారీ స్థాయిలో విజయవంతం అవుతుందని ఆశించిన మేరకు స్పందన లభించింది.

వీటితో పాటు యాత్ర సాగే అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ బలాబలాలను బేరీజు వేసుకొని ఔత్సాహికులు, ఆశావాహులందరితో చర్చించిన అనంతరం మేడారం టూ భద్రాచలం యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లక్ష్యంగా ఈ యాత్రకు రూపకల్పన చేసినట్లు అర్థమవుతుంది. తొలివిడత 50 నియోజకవర్గాలు, 60 రోజుల పాటు యాత్ర చేపట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకోగా మొదట ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత నివ్వడం గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో విశేషంగా ఆదరించడమే ముఖ్య కారణంగా భావిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో పరిధిలోని ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికీ కాంగ్రెస్‌కు బలమైన పునాదులే ఉన్నాయి. ఈ పునాదులను ఆసరా చేసుకొని వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యాత్ర ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమైక్యతను సృష్టించి ప్రజలకు భరోసా కల్పించాలని యోచిస్తున్నారు.

అనుకున్నదే అమలు చేస్తున్న రేవంత్

అనుకున్నదే అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. ములుగు నియోజకవర్గంలో చివరి రోజు రేవంత్ రెడ్డి సడన్‌గా రూటు మార్చి పొలిటికల్ హీటు పెంచుతున్న మాటల తూటాలు సంధించారు. ప్రగతిభవన్ పై గురిపెట్టడంతో ఉమ్మడి జిల్లాలోని ముఖ్యమైన గులాబీ లీడర్లంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యా రు.

అధిష్టానం ఆదేశాలతో రేవంత్ రెడ్డిపై విరుచుక పడుతున్నారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, గండ్ర వెంకట రమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడిగా దాడి చేశారు.

మానుకోట ఎమ్మెల్యే, ఎంపీలపై ఫైర్

గులాబీ నేతలకు రేవంత్ రెడ్డి దీటుగా సమాధానం చెబుతూనే మానుకోట మీటింగ్‌లో ఏకంగా అక్కడి ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోతు కవితల‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములు గుంజుకుంటూ భూకబ్జాలకు పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ల్యాండ్, సాండ్, మైన్, వైన్ ఎక్కడ చూసినా గులాబీ లీడర్ల అక్రమాలు అన్యాయాలు రాజ్యమేలుతున్నాయంటూ విరుచుకబడ్డారు.

ఇక శంకర్ నాయక్ పైన తీవ్ర విమర్శలు చేశారు. అతను దుశ్శాసనుడు, ఇక్కడ రాక్షస పాలన సాగుతుంది. హత్య కేసులో నిందితుడు అంటూ చేసిన విమర్శలతో పొలిటికల్ హీటెక్కించారు. డోర్నకల్ లో తమ పార్టీ పాత నేత రెడ్యా నాయక్ పై ఏ విధంగా స్పందిస్తారని చర్చ సాగుతుంది.

ఈ సెగ్మెంట్‌లలో కాంగ్రెస్ బలంగా ఉంది

మేడారం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించారు. రెండు రోజులు ములుగు నియోజకవర్గంలోనే యాత్ర నిర్వహించారు. అనంతరం నర్సంపేట మినహా మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, పినపాక నియోజకవర్గాల మీదుగా భద్రాచలం దాకా యాత్రను కొనసాగించనున్నారు.

ఇందులో ములుగు, భద్రాచలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఈ ములుగు, భద్రాచలంతో పాటు ఇల్లందు, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇల్లందు, కొత్తగూడెం, పినపాక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరారు. 2014 నర్సంపేటలో కాంగ్రెస్ రెబల్, డోర్నకల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు.

డోర్నకల్‌ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌లో చేరారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లలో కాంగ్రెసు బలంగా ఉంది. తిరిగి తమ పట్టును సాధించాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. దీనికితోడు అధికార పార్టీ పైన పొంగులేటి తిరుగుబాటు సందర్భమూ కొనసాగుతుంది. నర్సంపేట మినహా మిగిలిన నియోజకవర్గం రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి పునాది

ఎన్నికలు త్వరలో రావచ్చుననే ఊహాగానాల నేపథ్యంలో పాలకపక్షానికి దీటుగా కాంగ్రెస్ సమాయత్త అవుతోంది. అందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రను ఈ ప్రాంతాల్లో ప్రారభించారు. ఇప్పటికే స్థానిక సమస్యలను నియోజకవర్గాల్లో జరిగే కార్నర్ మీటింగ్ లలో ప్రస్థావించాల్సిన సమస్యలపై పార్టీ నుంచి సమాచారం సేకరించినట్లు సమాచారం. ఈ మేరకే తన ప్రసంగాలు ఉంటున్నాయి.

గిరిజనుల ఇబ్బందులు, పోడు భూముల సమస్య, ఆయా నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధుల తీరువంటి అంశాలపై రేవంత్ రెడ్డి పార్టీ ప్రత్యేక బృందాల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. తమ ప్రాంతంలో జరిగే యాత్ర ఏర్పాట్లను చూసుకునే పనిలో ఆయా.. నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ టిక్కెట్ లు ఆశిస్తున్న ఆశావాహులు, పార్టీ కమిటీలు ఇప్పటికే నిమగ్నమయ్యారు. ఈ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి యాత్ర జోష్ నింపుతుందనే గంపెడంత ఆశతో కాంగ్రెస్ శ్రేణులున్నాయి. ఈ మేరకు ఆశాజనకమైన ఫలితాలు ప్రారంభమయ్యాయని కాంగ్రెస్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.