దూరదర్శన్, ఆలిండియా రేడియో.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ప్రసార మాధ్యమాలు. ఇవి ఒక విధంగా దేశ అధికారిక వాణిని వినిపించే, చూపించేవి ఇవే. ఇప్పటి దాకా పీటీఐ వార్తా సంస్థ నుంచి న్యూస్ ఫీడ్స్‌ను, ఆకాశవాణి తెప్పించుకునేవి. కానీ.. పీటీఐతో కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్న ప్రసార భారతి.. హిందుస్థాన్ సమాచార్ అనే సంస్థతో కొత్తగా ఒప్పందం చేసుకున్నది. విశేషం ఏమిటంటే.. హిందుస్థాన్ సమాచార్ అనే ఈ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉన్నది కావడం.
విధాత : ఇప్పటి దాకా దూరదర్శన్, ఆకాశవాణి (ఆలిండియా రేడియో) వార్తల కోసం దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ అయిన పీటీఐపై ఆధారపడిన ప్రసార భారతి (Prasar Bharati).. కాషాయం రంగు పులుము కోనున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీటీఐని కాదన్న ప్రసార భారతి.. RSS అండదండలు ఉన్న హిందుస్థాన్ సమాచార్ (Hindusthan Samachar) అనే సంస్థతో న్యూస్‌ఫీడ్స్ కోసం ఒప్పందం చేసుకున్నది.
వాస్తవానికి 2017 నుంచే ప్రసార భారతికి హిందుస్థాన్ సమాచార్ ఉచితంగా వైర్ సర్వీసులు (వార్తలు అందించే సర్వీసులు) అందిస్తున్నది. అయితే.. ఉభయ పక్షాలు ఫిబ్రవరి 9న అధికారికంగా ఒప్పందం చేసుకున్నాయి. 2025 మార్చి వరకు ఈ కాంట్రాక్టు కొనసాగనున్నది.
ఇందుకోసం హిందుస్థాన్ సమాచార్ సంస్థకు రెండేండ్లకు కలిపి రూ.7.7 కోట్లు చెల్లించనున్నది. రోజుకు కనీసం 100 వార్తా కథనాలను హిందుస్థాన్ సమాచార్ అందించాల్సి ఉంటుంది. ఇందులో కనీసం 10 జాతీయ స్థాయి స్టోరీలు, స్థానికవార్తలు (ప్రాంతీయ భాషల్లో) కనీసం 40 ఉండేలా చూసుకోవాలి.
పీటీఐతో ఒప్పందం రద్దు..
పీటీఐ(PTI), యూఎన్‌ఐ (UNI) వార్తా సంస్థల వార్తలు గత కొన్ని సంవత్సరాలుగా మోదీ సర్కారు (Narendra Modi government)కు మింగుడు పడటం లేదని చెబుతున్నారు. ఒక దేశంలో పీటీఐ ఎడిటర్ ఇన్ చీఫ్‌గా తాము ప్రతిపాదించిన వ్యక్తినే నియమించాలని ఒత్తిడి చేసినట్టు సమాచారం. దీనిని పీటీఐ యాజమాన్యం తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో పీటీఐని పక్కనపెట్టి హిందుస్థాన్ సమాచార్‌కు అవకాశం ఇచ్చారని సమాచారం. అయితే.. బయటకు మాత్రం సబ్‌స్క్రిప్షన్ చార్జీలు సహేతుకంగా లేని కారణంగా పీటీఐతో ఒప్పందం రద్దు చేసుకోవాలని తమకు ఆదేశాలు వచ్చాయని ప్రసారభారతి వర్గాలు చెబుతున్నాయి.
హిందుస్థాన్ సమాచార్ నుంచి వార్తలు
ఇప్పటికే దేశంలో ప్రధాన మీడియా సంస్థలను మోదీ అనుకూల వర్గాలు కొనేశాయనేది బహిరంగ రహస్యమే. తాజాగా.. దేశంలో నికార్సయిన మీడియా దిగ్గజంగా ఉన్న ఎన్‌డీటీవీ (NDTV)ని సైతం మోదీ ఆప్తుడిగా చెప్పే గౌతం అదానీ కొనుగోలు చేశారు. మొత్తంగా దేశ మీడియా ఇప్పడు మోదీ అనుకూల శక్తుల చేతులలోనే ఉన్నది. ఇప్పడు ప్రసార భారతికి కూడా ఆర్‌ఎస్‌ఎస్ అండదండలున్న హిందుస్థాన్ సమాచార్ నుంచి వార్తలు అందనున్నాయి.
ఏమిటీ హిందుస్థాన్ సమాచార్?
బహుళ భాషల న్యూస్ ఏజెన్సీ అయిన హిందుస్థాన్ సమాచార్‌ను.. 1948లో సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంత కర్త అయిన ఎంఎస్ గోల్వాల్కర్(M.S. Golwalkar)తో కలిసి విశ్వహిందు పరిషత్‌ను స్థాపించిన శివరాం శంకర్ ఆప్టే (Shivram Shankar Apte) ప్రారంభించారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాణిజ్య ప్రకటనల రూపంలో హిందుస్థాన్ సమాచార్‌కు బాగా లబ్ధి కలిగిందనే ప్రచారం ఉన్నది. జాతీయ వాద దృక్కోణంలో వార్తలు ఇచ్చే హిందుస్థాన్ సమాచార్.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 1986లో మూతపడింది. అయితే.. వాజ్‌పేయి (A.B. Vajpayee) ప్రధానిగా ఉన్న కాలంలో అంటే.. 2002లో దాన్ని పునరుద్ధరించారు.