విధాత: రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ (Sachin Pilot) కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పొగకగా, తన సొంత మార్గాన్ని ఎంచుకోబోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారు. తన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి సందర్బంగా ఈ నెల 11వ తేదీన పార్టీ పేరును ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
రోజు పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. పార్టీ పేరు కూడా @ప్రగతిశీల్ కాంగ్రెస్* అని తెలిసింది. ఈ ప్రక్రియలో ఆయనకు ప్రశాంత్ కిశోర్‌కు చెందిన పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ ప్యాక్ సహాయం చేయనున్నట్టు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి పైలట్ అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే ఐప్యాక్ సంస్థ ఒక ప్రణాళికను రూపొందించినట్టు తెలిసింది. పార్టీ ప్రకటన అనంతరం పైలట్ నిర్వహించాల్సిన కార్యాచరణను ఇప్పటికే సిద్ధంచేసినట్టు కూడా సమాచారం.
ఐ ప్యాక్ వ్యూహ రచనతో పైలట్ ముందుకు
వసుంధర రాజే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై గెహ్లాట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 11న తన ఒకరోజు నిరాహారదీక్షను ప్లాన్ చేయడంలో ఐప్యాక్ వాలంటీర్లు పైలట్‌కు సహాయం చేసినట్లు భావిస్తున్నారు.
రిక్రూట్‌మెంట్ పరీక్షలలో ప్రశ్నపత్రం లీక్ ఘటనపై చర్యల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి అజ్మీర్ నుంచి జైపూర్ వరకు పైలట్ ఐదు రోజుల పాదయాత్ర చేశారు. దీనికి ప్లాన్ చేయడంలో కూడా ఐ ప్యాక్ సంస్థ పాలుపంచుకున్నట్టు తెలిసింది.
మూడు డిమాండ్లు పెట్టిన పైలట్
పాదయాత్ర ముగింపు సందర్బంగా మే 15న జైపూర్ శివారులో నిర్వహించిన బహిరంగ సభలో సచిన్ పైలట్ మాట్లాడారు. ఈ సందర్భంగా మూడు డిమాండ్లను ప్రధానంగా ప్రస్తావించారు. వసుంధర రాజే ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పునరుద్ధరించాలని, పేపర్ లీక్ కారణంగా నష్టపోయిన యువతకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. ఈ మూడు డిమాండ్లను మే 31లో నెరవేర్చాలని కోరారు. లేనిపక్షంతో ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.