పటేల్ చొరవతోనే భారత్‌లో విలీనమైన లక్షద్వీప్.. వెలుగులోకి కీలక అంశాలు
మాల్దీవులు, భారత్ మధ్య జరుగుతున్న దౌత్యపరమైన ఘర్షణ కారణంగా లక్షద్వీప్‌లపై చర్చ బాగా నడుస్తోంది

విధాత: మాల్దీవులు, భారత్ మధ్య జరుగుతున్న దౌత్యపరమైన ఘర్షణ కారణంగా లక్షద్వీప్ (Lakshadweep) లపై చర్చ బాగా నడుస్తోంది. ప్రధాని మోదీ (Modi) అక్కడ తాను చూసిన ప్రదేశాలను ఫొటోలు తీసి పెట్టడంతో ఈ చర్చకు బీజం పడింది. మాల్దీవులకు పోటీగా లక్షద్వీప్‌లను ప్రమోట్ చేయడానికే మోదీ ఇలా చేశారనడం.. దీనికి ప్రతిగా మాల్దీవుల మంత్రులు భారత్‌పై విషం కక్కడం జరిగిపోయాయి. ఆ తర్వాత వారిని ఆ దేశ ప్రభుత్వం కేబినెట్ నుంచీ బహిష్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో లక్షద్వీప్‌ల చరిత్రపై నెట్‌లో చర్చ నడుస్తోంది.
సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ (Sardar Vallabh Bhai Patel) కనుక లేకుంటే ఈ పాటికి ఈ అందమైన దీవులు పాకిస్థాన్ పరమయ్యేవన్న చారిత్రక నిజం మరోసారి ప్రచారంలోకి వచ్చింది. లక్షద్వీప్ గురించి ఒకసారి గమనిస్తే కేవలం 32.69 చ.అడుగుల ఈ భూభాగం 36 చిన్న చిన్న దీవులుగా విడిపోయి ఉంటుంది. విస్తీర్ణం పరంగా పెద్దది కాకపోయినప్పటికీ అరేబియా సముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఈ దీవులు ఉండటం భద్రతా పరంగా చాలా కీలకం. ఇక్కడి నుంచి ఎర్ర సముద్రం వైపు వెళ్లే నౌకలను పరిశీలించొచ్చు. అలాగే సముద్ర తీర ప్రాంత భద్రతపై ఓ కన్నేయచ్చు.
ఈ నేపథ్యంలో 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. అనేక స్వతంత్య్ర రాజ్యాలు తాము విడిగా ఉండిపోతామని.. భారత్‌లో కలవబోమని భీష్మించుకు కూర్చున్నాయి. వీరిని సామదానభేద దండోపాయాలతో దారికి తెచ్చిన దేశ తొలి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్.. వాటన్నింటినీ భారత్‌లో విలీనం చేశారు. ఈ క్రమంలో ముస్లిం మెజారిటీగా ఉన్న పాకిస్థాన్‌కు లక్షద్వీప్ ఒక సులువైన లక్ష్యంలా కనిపించింది. అప్పటికి లక్షద్వీప్‌పై మనం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పాక్ తెలివిగా తమ నేవీకి చెందిన ఒక పడవను పంపింది. లక్షద్వీప్ వెళ్లి పాక్ జెండా పాతాలని సైనికులను ఆదేశించింది.
దీనిపై ఉప్పందుకున్న భారత్ తరపు నిపుణులు ఈ విషయాన్ని పటేల్‌కు చేరవేశారు. ఆయన ఒక్క క్షణం ఆలోచించకుండా దక్షిణ భారతంలో ఉన్న అధికారులకు ఫోన్ చేసి.. వెంటనే లక్షద్వీప్‌కు వెళ్లి భారత్ జెండా పాతాలని ఆదేశించారు. కొచ్చి తీరం నుంచి లక్షద్వీప్ 350 కి.మీ. లోపు దూరమే కావడంతో పాక్ నౌక కన్నా ముందే మన నౌక చేరుకుని జెండా పాతింది. దీనిని చూసిన పాక్ నౌక వెనుదిరిగి వెళ్లిపోయింది. ఒకవేళ పటేల్ కనుక ఆరోజు తటపటాయించి ఆలస్యం చేసి ఉంటే ఈ రోజు లక్షద్వీప్ పాకిస్థాన్ పరమై ఉండేది. భారత్‌కు పక్కలో బల్లెంలా ఉంటూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉండేది.