" /> " /> " /> " />
“పార్టీ అధిష్టానం ఆదేశించినా… నా మనసులో మాట అడిగినా… డోర్నకల్ నుంచి పోటీ చేయడమే నా అభిమతం మిగతా వారిలెక్క మాట మార్చే పద్ధతి నాకు తెలియదు”
– రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
“డోర్నకల్లో ఇంటి దొంగలతో తనకు ఇబ్బంది ఉంది. పార్టీలో ఉంటూ లక్షలు సంపాదించుకున్నవారు, పార్టీకి అన్యాయం చేసి, తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నారు”
– డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇటీవల వేర్వేరుగా మాట్లాడిన తాజా మాటలివి.
హైదరాబాదులో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి సత్యవతి మాట్లాడుతూ డోర్నకల్ నుంచి పోటీ పై మనసులోని మాట కుండబద్దలు కొట్టారు.
మంత్రి సత్యవతి మనసులోని మాటను ఎమ్మెల్యే రెడ్యానాయక్ ముందుగా గ్రహించారో లేక ఆమె తీరుపట్ల అనుమానం వచ్చిందో గానీ ఆయన కూడా ఇంటి దొంగల వల్ల తనకు ఇబ్బంది ఉందంటూ ఆత్మీయ సమ్మేళనాళాల్లో బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
డోర్నకల్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి సత్యవతి స్పందనలతో నియోజకవర్గ గులాబీ పార్టీలో ఒక్కసారిగా అగ్గిరాజుకున్నది. ఇంతకాలం దాగుడుమూతలు ఆడిన ఇరువురు నాయకులు, ఇప్పుడు రాబోయే ఎన్నికల నేపథ్యంలో బహిరంగంగా మాట్లాడడం పార్టీలో నెలకొన్న రెండు గ్రూపులకు అద్దం పడుతుంది.
డోర్నకల్ నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం వరకు నిట్ట నిలువుగా చీలివుంది. రెడ్యా వర్గం సత్యవతి వర్గంగా ఎవరికి వారు నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అనుచరులు చేజారకుండా పట్టుసడలకుండా గట్టి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో వీరి వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ లక్ష్యంగా ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నట్లు స్పష్టమైంది. ఈ మేరకు చాప కింద నీరులా పావులు కదుపుతున్నట్టు అర్థమవుతుంది. ఈ సమస్యను గులాబీ పార్టీ అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇరువురు అధిష్టానానికి దగ్గరగానే మసలుకుంటున్నారు.
డోర్నకల్ నియోజకవర్గంలో మొదటి నుంచి రెడ్యానాయక్, సత్యవతి రాజకీయ వైరి వర్గాలు గానే కొనసాగుతూ వచ్చారు. ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థి పార్టీల నాయకులుగా పోటీపడ్డారు. రెడ్యానాయక్ కాంగ్రెస్ నాయకుడిగా ఉంటే సత్యవతి రాథోడ్ తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా ఉంది. ఎన్నికల్లో ఒకరు గెలిస్తే, మరొకరు ఓటమి పాలయ్యారు. అలాంటి ఇద్దరు నాయకులు గులాబీ పార్టీలో చేరారు. గులాబీ పార్టీలో ఇప్పుడు ఒకరు ఎమ్మెల్యేగా, ఒకరు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించడంతో నియోజకవర్గంలో యథాతథంగా గ్రూపులు ఉన్నప్పటికీ, ఎన్నికల్లో పోటీ లేకుండా టిఆర్ఎస్ పార్టీ అధినేత చర్యలు తీసుకున్నారు.
2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అవకాశం కల్పించి, సత్యవతి రాథోడ్‌కు నచ్చ చెప్పారు. ఎన్నికల తర్వాత అనూహ్యంగా సత్యవతికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి, మంత్రిని చేయడంతో పరోక్షంగా డోర్నకల్ నియోజకవర్గంలో రెండు వర్గాలు ఉనికిలో కొనసాగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాబోయే ఎన్నికల నేపథ్యంలో అటు రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడం ఇప్పుడు అధిష్టానానికి అగ్నిపరీక్షగా మారింది. నియోజకవర్గంలో రెండు గ్రూపులు బహిరంగంగానే కార్యకలాపాలు కొనసాగించే ఈ పరిస్థితి రాబోయే ఎన్నికల్లో ఏ విధమైన ప్రభావం చూపుతోందోనని చర్చ సాగుతుంది.