Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు !

విధాత, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆదివాసులపై విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఆయనపై ఈ కేసు నమోదైంది. విజయ్ దేవరకొండపై చర్యలు తీసుకోవాలని ఆదివాసులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో పాటు అనేక చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
గత నెల 26న జరిగిన తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఈవెంట్‌లో పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. ‘పాకిస్తాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదని.. అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం మీద ఎటాక్ చేస్తారన్నారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే..500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పని లేకుండా కొట్లాడుతారన్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి’ అని అన్నారు. విజయ్ దేవరకొండ ఆదివాసులను అవమానించేలా మాట్లాడారని ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపూనగర్ అధ్యక్షుడు కిషన్‌రాజ్ చౌహాన్ కిషన్ సహా గిరిజన సంఘాలు తప్పుబట్టాయి. హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ కామెంట్స్ ఆదివాసీల సంస్కృతి, జీవన విధానాన్ని అవమానించేలా ఉన్నాయని వారు ఆరోపించారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘కింగ్ డమ్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో విజయ్ సరసన మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘జెర్సీ’ మూవీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ విజయ్ అభిమానులను ఆకట్టుకుంది.