అయోధ్య ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం అక్షింతలు
రామ జన్మభూమి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాలను అడ్డుకోవడానికి వీలులేదని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రామ జన్మభూమి (Ayodhya) ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం ప్రత్యక్ష ప్రసారాలను అడ్డుకోవడానికి వీలులేదని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర వర్గాల వారు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న కారణంతో అయోధ్య ప్రసారాలను అడ్డుకోవడం ఆక్షేపణీయమని వ్యాఖ్యానించింది. రామాలయం ప్రతిష్ఠాపన కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని ఆరోపిస్తూ తమిళనాడు (Tamilanadu) బీజేపీ శాఖ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలు అత్యవసరంగా విచారణ జరిపారు. ఒకవేళ మైనారిటీలు ఉన్నారని.. ఆయా ప్రదేశాల్లో అయోధ్య ప్రసారాలను అడ్డుకుంటే ప్రభుత్వం పెద్ద ప్రమాదంలో పడటమేనని వ్యాఖ్యానించారు. ఒకవేళ అలాంటి సమస్య ఏమైనా ఉంటే దానిని మీరు పరిష్కరించాలి. అంతే కానీ మైనారిటీలు ఉన్నారని ఇలాంటి నిబంధనలు విధించడం సరికాదు అని తమిళనాడు తరఫున హాజరైన అడిషన్ అడ్వకేట్ జనరల్ స్పష్టం చేసింది.
ఒక మతం ఎక్కువగా ఉన్నారని.. మరో వర్గం వారి కార్యక్రమాలను అడ్డుకోవాలన్ని మీ ఆదేశాలు దేశమంతా అమలైతే.. మైనారిటీలు ఎప్పటికీ ప్రార్థనలు చేసుకోలేరని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం అయోధ్య ప్రసారాలను నిషేధిస్తూ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొంటూ మొదటిగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనివే కాకుండా ప్రైవేటు ఆలయాల్లో కూడా ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులను మోహరించారని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వం ఖండించింది. ఇవి నిరాధార ఆరోపణలని పేర్కొంది.