గద్దెపైకి నేడు సమ్మక్క తల్లి రాక
మేడారం జాతర రెండో రోజు మరింత ప్రత్యేకం. సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క గురువారం గద్దెపైకి రానుంది. సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలయ్యాయి

- నేడు మేడారం జాతరలో కీలక ఘట్టం
- సమ్మక్కను తీసుకొచ్చేందుకు అధికారుల ఏర్పాటు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడారం జాతర రెండో రోజు మరింత ప్రత్యేకం. సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క గురువారం గద్దెపైకి రానుంది. సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలయ్యాయి. తొలుత మేడారంలోని సమ్మక్క గుడిని శుద్ధి చేశారు. మామిడి తోరణాలు కట్టారు. శక్తిపీఠాన్ని ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేశారు. పూజారులు అడవికి వెళ్లి వెదురు వనం, అడెరాలు తెచ్చి గద్దెపై నిలిపారు.
ఆడెరాలను పసుపు, కుంకుమతో అలంకరించిన తర్వాత సాయంత్రం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకల గుట్ట సమీపంలోకి వెళుతుంది. అక్కడి నుంచి గుట్టపైకి ప్రధాన పూజారి ఒక్కరే వెళతారు. అక్కడ ఉన్న సమ్మక్క రూపమైన కుంకుమ భరిణ, ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేసి కృష్ణయ్య ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
ఈ పూజాతంతు అంతా గోప్యంగా జరుగుతుంది. ఆ తర్వాత పూజారి తల్లి స్వరూపాన్ని తీసుకొని కిందకు వస్తున్నట్టు సంకేతం ఇస్తారు. తల్లిని తీసుకొని ఆయన కిందకు దిగగానే అక్కడ మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు.. సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లో మూడు రౌండ్లు తుపాకీని పేల్చుతారు. గుట్టపై నుంచి సమ్మక్క కిందకు ఏతెంచే వరకు గుట్ట కింద ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తారు. ఆట పాటలతో అలరిస్తారు.
గుట్టదిగిన వెంటనే మెరుపు వేగంతో..
పూజారులు సమ్మక్క తల్లితో కిందకు దిగిన తర్వాత అత్యంత వేగంగా మేడారం గద్దెవైపు కదులుతారు. దారి పొడవునా భక్తులు బారులుతీరి నిల్చుంటారు. మంగళహారతులు పడతారు. కోళ్లు, గొర్రెలను బలిస్తారు. వీలైనంత మేరకు రాత్రి 9-10 గంటల మధ్య సమ్మక్కను గద్దెపైకి పూజారులు తీసుకువచ్చేలా జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో జాతర మరోస్థాయికి చేరుతుంది.
రాత్రి పూజలందుకున్న సారలమ్మ
డప్పు చప్పుళ్లు.. కోయల నృత్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారాలమ్మ మేడారం గద్దెపైకి బుధవారం చేరుకుంది. పగిడిద్దరాజు గోవిందరాజులు కూడా గద్దల పైకి చేరుకున్నారు. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది. సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం బుధవారం ఉదయం ఆమె వెలసిన కన్నెపల్లి ఆలయం నుంచే ఆర్భాటంగా మొదలైంది. ఆలయాన్ని శుద్ధి చేసి.. ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు సాయంత్రం ఏడుగంటల దాకా ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మ తల్లి రూపంలో ఆలయం నుంచి బయటకు వచ్చిన పూజారి సారయ్య.. భక్తుల మొక్కుల సమర్పణ నడుమ మేడారం దిశగా కదిలారు. కన్నెపల్లి నుంచి రెండు కిలోమీటర్ల దూరం దారిపొడవునా భక్తులు బారులుతీరి హారతులిచ్చారు.
రాత్రి 12.11 గంటలకు సారలమ్మ గద్దెకు చేరుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ నుంచి పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజును కూడా గద్దెలపైకి చేర్చారు. అంతకుముందు పగిడి ద్దరాజు-సమ్మక్క కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం సమ్మక్క రాకతో జాతరలోని కీలక ఘట్టం పూర్తవుతుంది. జంపన్న వాగు భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రధానమైన కార్యక్రమం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. సమ్మక్క తల్లిని గద్దె పైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.