♦ త్వరలో కాంగ్రెస్‌లో చేరిక
♦ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడ్డ గత ప్రభుత్వం
♦ అందుకే ఓడించారని భాస్కర్ రెడ్డి వెల్లడి
కరీంనగర్: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆకారపు భాస్కర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన రాజీనామాను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం తాను వందలాది మంది సీనియర్ కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీలో చేరానని చెప్పారు. కానీ.. ఈ ఐదేళ్లలో రాష్ట్ర, జిల్లా నాయకత్వం తమను నిర్లక్ష్యం చేసిందని, ప్రోత్సహించకుండా అవమానాలకు గురిచేసిందని తెలిపారు.
దీనికితోడు నేతలు ప్రజలకు అందుబాటులో లేకుండా అనేక ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. అందుకే.. ఆ పార్టీకి రాజీనామా చేసి సొంత గూటికి చేరబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే వెయ్యి మందికి పైగా కార్యకర్తలతో హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మరో వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా కార్యక్రమాలు చేపడుతూ దూసుకుపోతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
రానున్న ఎంపీ ఎన్నికల్లో ఏ అభ్యర్థిని ప్రకటించినా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. పార్టీలో చేరాక తమ పనితనం ఏంటో చూపిస్తామని వెల్లడించారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం ప్రకటించారు. విలేకరుల సమావేశంలో నాయకులు వాసాల రవీందర్, ఎంఏ కరీం, ఎండీ ఆసిఫ్, తాళ్ల పళ్లి అంజయ్య గౌడ్, ఎండీ సలీం, ఎండీ ఖదీర్, ఎండీ సయ్యద్ గౌస్, ఎంఏ నహీం, కే జగన్ రెడ్డి, ఎండీ కుర్షిద్ అలీ, ఎంఏ రహమాన్, ఎండీ తహసీన్, కాసారపు ఎల్లయ్య, సయ్యద్ కాజా గౌసుద్దీన్ పాల్గొన్నారు