అయోధ్య బాల రాముడికి ప్రత్యేక మండల పూజ..!
కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరాడు

Ayodhya | కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరాడు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమైన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అభిజిత్ ముహూర్తం, ఇంద్ర యోగం, మృగశిర నక్షత్రం, మేష లగ్నం, వృశ్చిక నవాంశల, ద్వాదశి తిథిలో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అయితే, ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసినా మండల పూజల కొనసాగనున్నది.
మండలం అంటే 48 రోజుల పాటు పూజలు, అభిషేకాలు కొనసాగనున్నాయి. మండల పూజలు దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందాయి. జనవరి 23 నుంచి మరో 48 రోజుల పాటు ప్రత్యేక పూజలు కొనసాగుతాయని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 48 రోజుల పూజను మండల పూజ అంటారని తెలిపారు. ఈ మండల పూజకు ఉత్తర భారతదేశంలో అంత ప్రాచుర్యం లేదని.. అయితే అయోధ్యలోని పండితులు, సాధువులకు తెలుసునని చంపత్ రాయ్ చెప్పారు.
కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన జగద్గురు మధ్వాచార్య విశ్వ ప్రసన్న తీర్థ స్వామి నేతృత్వంలో ఈ మండల పూజ జరుగుతుందని తెలిపారు. రామజన్మభూమి తీర్థ క్షేత్రానికి విశ్వ ప్రసన్న తీర్థ మహారాజ్ ధర్మకర్త అని చెప్పారు. ఈ మండల పూజలో రాంలల్లా విగ్రహానికి ప్రతిరోజూ వెండి కలశంలోని ద్రవ్యాలతో అభిషేకం చేయనున్నారు. వేదపండితులు చతుర్వేదం, పలు గ్రంథాలను పఠించనున్నారు.
మండల పూజ 41 నుంచి 48 రోజులు ఉంటుంది. సుధీర్ఘంగా సాగే ఉపవాస దీక్ష. ఎంతో కఠినంగా ఉంటుంది. శబరిమల అయ్యప్ప భక్తులు మండల దీక్ష తీసుకుంటారు. మాల వేసిన వారు మండల పూజ ఉపవాసం ఉండాలి. మండల పూజ సమయంలో సరళమైన జీవితాన్నే గడపాల్సి ఉంటుంది. ఉపవాసం సమయంలో తమ శరీరంతో పాటుగా మనసును సైతం శుభ్రంగా ఉంచుకోవాలి. మనసులోకి ఎలాంటి ఆలోచనలు రానీయకూడదు. మండలం పాటు ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలి.
బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది. మండల పూజలో ఎన్నో కఠిన నియమాలుంటాయి. వాటన్నింటిని భక్తిశ్రద్ధలతోనే పాటించాలి. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో 41 రోజుల పాటు జరిగే మండల పూజకు ప్రసిద్ధి. అయ్యప్ప భక్తులు 41 రోజుల మండల దీక్షను తీసుకుంటారు. ఇదిలా ఉండగా.. అయోధ్య ఆలయంలో మండల పూజ గణపతి పూజతో మొదలవుతుంది. మొదట గణపతిని ఆవాహన చేస్తారు. ఈ నిత్య పూజలు విష్ణువును సంతోషపరుస్తాయని నమ్మకం. రాముడు మహావిష్ణువు అవతారమే. అందుకే అయోధ్యలోని రామాలయంలోనూ మండల పూజ నిర్వహిస్తున్నారు.