Starlink | స్టార్‌లింక్ శాటిలైట్ల నుంచి రేడియేషన్.. అంతరిక్ష ప్రయోగాలకు ముప్పు
Starlink విధాత: మారుమూల ప్రాంతాలకు స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి అంటూ వచ్చిన స్టార్ లింక్ (Star Link).. మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తోందని కొంత మంది పరిశోధకులు పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ ప్రయోగించిన ఉపగ్రహాల సమూహమే స్టార్ లింక్. ప్రస్తుతం ఇది 55 దేశాల్లో ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. అయితే దీనిలో శాస్త్రవేత్తలు గుర్తించిన లోపమేంటి? స్టార్ లింక్ నుంచి వచ్చే రేడియేషన్.. అంతరిక్షంలో పరిశోధనకు ఉపయోగించే రేడియో […]

Starlink
విధాత: మారుమూల ప్రాంతాలకు స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి అంటూ వచ్చిన స్టార్ లింక్ (Star Link).. మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తోందని కొంత మంది పరిశోధకులు పేర్కొన్నారు. ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ ప్రయోగించిన ఉపగ్రహాల సమూహమే స్టార్ లింక్. ప్రస్తుతం ఇది 55 దేశాల్లో ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. అయితే దీనిలో శాస్త్రవేత్తలు గుర్తించిన లోపమేంటి?
స్టార్ లింక్ నుంచి వచ్చే రేడియేషన్.. అంతరిక్షంలో పరిశోధనకు ఉపయోగించే రేడియో సిగ్నల్స్‌కు అంతరాయం కలిగిస్తోందని ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం (Study) పేర్కొంది. స్టార్‌లింక్ శాటిలైట్లలో ఉన్న ఎలక్ట్రానిక్స్ విడి భాగాలు తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న రేడియో వేవ్స్‌ను వెలువరిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. స్టార్‌లింక్‌కు కేటాయించిన బ్యాండ్ విడ్త్ కంటే ఇవి ఎంతో వేరుగా ఉన్నాయని పేర్కొన్నారు.
స్టార్‌లింక్ వంటి శాటిలైట్ సమూహాల వల్ల రానున్న రోజుల్లో అంతరిక్ష రంగంపై పడనున్న ప్రభావాన్ని ఈ పరిశోధన గుర్తించిందని అధ్యయనానికి నాయకత్వం వహించిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్‌కు చెందిన ఫెడెరికో డి వ్రునో తెలిపారు. సమీప భవిష్యత్తులోనే ఇలాంటి శాటిలైట్ల సంఖ్య పెరగడం వల్ల రేడియేషన్ మరింత అధికమై పలు సమస్యలు వస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు.
ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు లో ఫ్రీక్వెన్సీ అరే టెలిస్కోప్‌ను ఉపయోగించారు. దీని ద్వారా మేము 68 స్టార్‌లింక్ శాటిలైట్లను పరిశీలించగా 47 శాటిలైట్లు రేడియేషన్‌ను వెలువరిస్తున్నట్లు గుర్తించాం. ఈ సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ రేడియో ఆస్ట్రానమీకి కేటాయించిన బ్యాండ్ విడ్త్‌లోకి వస్తున్నాయి అని పరిశోధనలో పాల్గొన్న సీస్ బస్సా పేర్కొన్నారు.
అయితే ఇది మానవ ప్రమేయం లేకుండా జరుగుతున్న ప్రక్రియ అని తెలిపారు. ఇంటర్నేషనల్ ఎలక్ట్రోకెమికల్ కమిషన్ పరిధిలోకి అంతరిక్షం రానందున ఇది చట్టవ్యతిరేకం అని చెప్పడానికి కూడా లేదని వెల్లడించారు. దీనిపై అంతరిక్ష పరిశోధకులు స్పేస్ ఎక్స్‌ను సంప్రదించగా.. అవాంఛిత రేడియో సిగ్నల్ లీకేజీలను అరికట్టడానికి పరిశోధనలు చేస్తున్నామని, త్వరలోనే పరిష్కారాన్ని కనుగొంటామని చెప్పినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.
రానున్న రోజులో మరిన్ని శాటిలైట్లు
శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్‌లో రారాజుగా ఉన్న స్పేస్ ఎక్స్ (Space X) ప్రస్తుతం అంతరిక్షంలో 4,365 చిన్న చిన్న ఉపగ్రహాలను కలిగి ఉంది. రానున్న రోజుల్లో మరి కొన్ని వేల ఉపగ్రహాలను పంపించేందుకు మస్క్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అమెజాన్ (Amazon) సంస్థకు చెందిన వన్ వెబ్ కూడా ఈ రంగంలోకి అడుగు పెడుతోంది. 2024లో తొలి విడత ఉపగ్రహాలను ప్రయోగించనుంది. మరో సంస్థ వన్‌వెబ్‌కు సుమారు 600 శాటిలైట్లు ఉన్నాయి.