దేశవ్యాప్త కార్మికుల సమ్మె సక్సెస్

దేశవ్యాప్త కార్మిక గ్రామీణ బందు పిలుపులో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్స్ జాయింట్ ఫ్లాట్ ఫారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచమ్మ మైదాన్ వరకు మహా ప్రదర్శన నిర్వహించారు.

  • By: Somu    latest    Feb 16, 2024 11:56 AM IST
దేశవ్యాప్త కార్మికుల సమ్మె సక్సెస్
  • కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను వ్యతిరేకంగా మహా ప్రదర్శన
  • కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలి


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్త కార్మిక గ్రామీణ బందు పిలుపులో భాగంగా శుక్రవారం వరంగల్ జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్స్ జాయింట్ ఫ్లాట్ ఫారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచమ్మ మైదాన్ వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా జరిగింది. శుక్రవారం ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన చేశారు.


అనంతరం కలెక్టరేట్ ఎదుట బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున కార్మికులు రైతులు నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం రెండు గంటల పాటు దద్దరిల్లిపోయింది. పోలీసులు లోనికి వెళ్లకుండా భారీ బందోబస్తును నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారం కొచ్చి పది సంవత్సరాలు పూర్తయిందని రైతాంగ కార్మిక వ్యవసాయ కూలీల సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు.


సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని బిజెపి విస్మరించిందని నేడు ఉద్యోగ కల్పన పూర్తిగా పడిపోయి గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి నిరుద్యోగం చేరిందని వారు విమర్శించారు శ్రామికుల నిజ వేతనాలు 20% తగ్గిపోయాయని ధరలను నియంత్రిస్తామని చేసిన వాగ్దానం అమలు కాకపోగా ధరలు కనివిని ఎరగని రీతిలో 30 నుండి 56% మేరకు పెరిగాయని పెట్రో ఉత్పత్తులపై పన్నుల వాటాను 243 శాతానికి పెంచారని వారు విమర్శించారు.


అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చారని కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికి కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు నిర్ణయించేందుకు బిజెపి ప్రభుత్వం అంగీకరించడం లేదని అన్నారు సమ్మే హక్కును కాలరాస్తూ పీఎఫ్ ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డులను నిర్వీయం చేస్తున్నారని పెట్టుబడుదారుల లాభాల కోసం తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తెస్తున్నారని కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెంచి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని వారు మండిపడ్డారు.


వ్యవసాయ కూలీలకు జీవనాధారంగా ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ తగ్గిస్తున్నారని ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించేందుకు నిరాకరిస్తున్నారని ప్రతి వ్యక్తికి 200 రోజుల పని 600 రూపాయల రోజువారి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర బిజెపి కార్పొరేట్ అనుకూల మతతత్వ విద్వేష రాజకీయాలతో ప్రజల మధ్య చీలిక తెచ్చి మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తుందని దీనికి వ్యతిరేకంగా కార్మికులు రైతులు పెద్ద ఎత్తున ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్ ,సిపిఎం జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి, సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బికపతి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి ఏఐటీయూసి జిల్లా కార్యదర్శి గన్నారపు రమేష ఐ ఎన్ టి సి జిల్లా అధ్యక్షులు పుల్లా రమేష్ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్ ఏఐటియుసి జిల్లా కార్యదర్శి నర్రా ప్రతాప్ సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి సిఐటియు రాష్ట్ర నాయకురాలు కాసు మాధవి రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సారంపల్లి వాసుదేవరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య, ఎంసిపిఐ జిల్లా నాయకులు హంసారెడ్డి, ఏఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజు గౌడ్ పాల్గొన్నారు.