Kommineni Srinivas Rao: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి సుప్రీం ఊరట!

న్యూఢిల్లీ : అమరావతి మహిళలను కించపరిచారన్న అభియోగాలపై ఏపీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావుకి సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. కొమ్మినేనిని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి చానెల్ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలో అరెస్టు చేసి ఏపీలో రిమాండ్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ పీకే మిశ్రా, జస్టిన్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
టీవీ డిబెట్ లో విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం? అంటు మండిపడిన ధర్మాసనం ఆయన్ని వెంటనే విడుదల చేయండని ఆదేశించింది. టీవీ డిబేట్‌లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటామని.. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని స్పష్టం చేసింది. అదే సందర్భంగా డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలని..కొమ్మినేని విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుంది’’ అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.