ఎలక్టోరల్‌ బాండ్లు.. చట్టబద్ధమైన లంచమే: కాంగ్రెస్‌ నేత చిదంబరం

  • Publish Date - September 30, 2023 / 11:46 AM IST

  • అక్టోబర్‌ 4 నుంచి బీజేపీకి పండగే
  • కాంగ్రెస్‌ నేత చిదంబరం విమర్శ

న్యూఢిల్లీ : ఎలక్టోరల్‌ బాండ్లు చట్టబద్ధమైన లంచాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం అభివర్ణించారు. అక్టోబర్‌ 4 నుంచి ప్రారంభం కానున్న ఈ బండ్లతో బీజేపీకి బంగారు పంట పండుతుందని వ్యాఖ్యానించారు. అక్టోబర్‌ 4 నుంచి పది రోజుల పాటు 28వ విడుత ఎలక్టోరల్‌ బాండ్లను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అనుమతించిన విషయం తెలిసిందే.


తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. గత రికార్డులను పరిశీలిస్తే.. గుప్త విరాళాలుగా చెబుతున్న ఈ ఎలక్టోరల్‌ బాండ్లలో 90శాతం బీజేపీకే అందబోతున్నాయని, బీజేపీకి బంగారు పంట పండబోతున్నదని చిదంబరం ఎక్స్‌ పోస్టింగ్‌లో పేర్కొన్నారు.


‘ఆశ్రిత పెట్టుబడిదారులు తమ చెక్‌బుక్‌లు తెరిచి ఢిల్లీలో ఉన్న దేవుడు, యజమానికి వితరణలు ఇచ్చేందుకు సిద్ధమవుతారు’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల నిధుల సేకరణలో పారదర్శకత కోసం రాజకీయ పార్టీలకు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్‌ బాండ్లు తీసుకొచ్చారు. వీటిని మొదటిసారి 2018 మార్చిలో విక్రయించారు. ఒక్క స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు మాత్రమే వీటిని జారీ చేసే అధికారం ఉన్నది.


ఎలక్టోరల్‌ బాండ్లను భారతీయ పౌరులు లేదా దేశంలో స్థాపించిన కంపెనీలు కొనుగోలు చేయవచ్చు. లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క శాతం ఓట్లు తెచ్చుకున్న రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా నిధులు పొందేందుకు అవకాశం ఉన్నది. అయితే.. వీటి ద్వారా అత్యధికంగా బీజేపీయే లాభపడుతున్నదనే విమర్శలు ఉన్నాయి.

Latest News