Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

విధాత, వెబ్ డెస్క్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు(42 percent reservation for BCs) కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు తెలంగాణ మంత్రిమండలి(Telangana Cabinet) ఆమోదం తెలిపింది. డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన మూడు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణ(SC classification)పై ఏకసభ్య కమిషన్ సిఫారసులను మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీనిపై శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానం చేశారు.
తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) వివరాలు నమోదు చేసుకోవడానికి రెండోసారి ఇచ్చిన గడువు పూర్తయిన నేపథ్యంలో ఆ వివరాలను మంత్రిమండలి సమగ్రంగా చర్చించింది.
ఎస్సీ వర్గీకరణపై వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని మరోసారి అధ్యయనం చేసిన జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికను మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎస్సీ వర్గీకరణపై భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కి ఆమోద తెలిపింది. శ్రీశైలం హైవేకు నాగార్జునసాగర్ హైవే మధ్య ప్రాంతంలో ఓఆర్ఆర్ వెలుపలి నుంచి ఆర్ఆర్ఆర్ బయట 2 కిలోమీటర్ల ప్రాంతం వరకు దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ విస్తరించి ఉంటుంది.
ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారికీ కిందకు బదిలీ చేస్తూ తీర్మానించారు. ఫ్యూచర్ సిటీ మొత్తంగా 7 మండలాలు, 56 గ్రామాలతో విస్తరించి ఉంటుంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 90 పోస్టులను మంజూరు చేస్తూ ఆమోదించింది.
హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆర్ఆర్ఆర్ అవతల 2 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏను విస్తరించారు. 11 జిల్లాల్లో 104 మండలాల్లో 1355 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి.
మహిళా సాధికారతకు పట్టం కడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025 కు కేబినెట్ ఆమోదం. గ్రామాల్లో సెర్ప్ కింద, పట్టణాల్లో మెప్మాగా విడిపోయి ఉన్న మహిళా సంఘాలు ఇకనుంచి ఒకే గొడుకు కింద తెస్తూ తీర్మానం ఆమోదించింది.
మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వానికి కనీస వయసును 18 ఏండ్ల నుంచి 15 ఏండ్లకు కుదించాలని, అలాగే సంఘాల్లో కొనసాగడానికి గరిష్ట వయసును 60 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచుతు నిర్ణయం తీసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటుకు వీలుగా దేవాదాయ చట్టంలో సవరణలు చేసింది.
2025 – 2030 మధ్య ఐదేళ్లకు గాను టూరిజం పాలసీకి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గుర్తించిన 27 ప్రాంతాలను ప్రత్యేక టూరిస్టు కేంద్రాలుగా తీర్చిదిద్దాలని… ఆ ప్రాంతాల అభివృద్ధి చేయడంలో 15 వేల కోట్లకు తగ్గకుండా పెట్టుబడులను రాబట్టేలా పాలసీ ఉండాలని నిర్ణయించింది.
మే నెలలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు ఏ లోటూ లేకుండా ఏర్పాట్లు చేయాలని… 2024 పారా ఒలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి ప్రభుత్వం ఉద్యోగ కల్పించాలని నిర్ణయించింది.
10,954 గ్రామాలకు రెవెన్యూ అధికారుల నియమాకం ఆమోదం తెలిపింది. పెద్ద గోల్కొండ సమీపంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయింపుకు.. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 361 పోస్టులకు అనుమతిస్తూ.. అలాగే, గురుకులాలకు మరో 330 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని 4.28 టీఎంసీ నుంచి 1.28 టీఎంసీకి తగ్గించాలని నిర్ణయించింది.
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి గారి నాయకత్వంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని తీర్మానం చేసింది. పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరక్కుండా చూడాలనే ఉద్దేశంతో అఖిల పక్ష సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయాలను కేంద్రానికి నివేదించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యూకేషన్ ఇనిస్టిట్యూషన్స సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలలకు 330రెగ్యులర్, 165ఔట్ సోర్సింగ్ తో పాటు మొత్తం 495పోస్టులకు ఆమోదం తెలిపింది.