Drinking water | తాగునీటిపై స్పెషల్ ఫోకస్

Drinking water | తాగునీటిపై స్పెషల్ ఫోకస్

నారాయ‌ణపుర నుంచి తాగునీరు

కర్ణాటకకు రాష్ట్ర సర్కార్‌ వినతి

లోక్‌సభ ఎన్నికలపై నీటి సమస్య

ప్రభావం చూపే అవకాశాలు

10 మున్సిపాలిటీల‌లో నీటి ఎద్దడి

క‌రీంన‌గ‌ర్‌, ఖమ్మం ప‌ట్ట‌ణాల్లోనూ కొర‌త‌

ట్యాంక‌ర్ల ద్వారా స‌ర‌ఫ‌రాకు ఏర్పాట్లు

అత్య‌వ‌స‌ర ప‌నుల‌కు రూ.100 కోట్లు

అద‌నంగా 15వ ఆర్థిక సంఘం నిధులు

నియోజ‌క‌వ‌ర్గానికి కోటి కేటాయింపు

క‌లెక్ట‌ర్ల‌కు అధికారాలు ఇచ్చిన ప్రభుత్వం

ప్రతిరోజూ సచివాలయంలో స‌మీక్ష‌

 

విధాత‌: తాగునీటి కొర‌త‌పై ఎట్ట‌కేల‌కు రాష్ట్ర స‌ర్కారు ఫోక‌స్ పెట్టింది. పార్ల‌మెంటు ఎన్నిక‌లు న‌డివేస‌విలో మే 13వ తేదీన పోలింగ్ జ‌రుగ‌నుండ‌డంతో నీటి స‌మ‌స్య ఓటింగ్‌పై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగానైనా గుర్తించిన రేవంత్ స‌ర్కారు దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. రాష్ట్రంలో నీటి కొర‌త రావ‌ద్ద‌ని ఇటీవ‌ల స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు నీటి కొర‌త ఎక్క‌డ ఎలా ఉందో తెలుసుకొని వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని చెప్పారు. ఈ మేర‌కు స‌చివాల‌యం కేంద్రంగా ప్ర‌తి రోజూ స‌మీక్ష నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే నారాయ‌ణపుర డ్యామ్ నుంచి తాగునీటి అవ‌సరాల కోసం అవ‌స‌ర‌మైన నీటిని విడుద‌ల చేయాల‌ని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వాస్త‌వంగా ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎగువ రాష్ట్రాల‌పై మ‌హారాష్ట్ర‌, కర్ణాటకలో కూడా వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో కృష్ణాన‌దిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్ జ‌లాశ‌యాల‌కు త‌గినంత వ‌ర‌ద నీరు రాలేదు. ఈ రిజ‌ర్వాయ‌ర్లు నిండ లేదు. దీంతో ఈ ఏడాది సాగునీటికి దిక్కులేకుండా పోయింది. బోరుబావులు వ‌ట్టి పోయాయి. క‌రువు ప‌రిస్థితులు నెల‌కొన్న త‌రుణంలో తాగునీటి ఎద్ద‌డి నివార‌ణ కోసం పాల‌కులు ముంద‌స్తుగా చ‌ర్య‌లు తీసుకోలేక పోయారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆరెస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. అయితే బొటాబొటీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ త‌న ప్ర‌భుత్వాన్ని కాపాడుకోవ‌డానికి రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌పై కేంద్రీక‌ర‌ణ చేసినంత‌గా స‌మ‌స్య‌ల‌పై కేంద్రీక‌రించ‌లేక‌పోయింద‌న్న విమ‌ర్శ‌లున్నాయి.

ముఖ్యంగా బీఆరెస్ పార్టీ అవినీతి ఆరోప‌ణ‌లు, కాళేశ్వ‌రం కుంగుబాటు, విద్యుత్తు కొనుగోళ్లు, మిష‌న్ భ‌గీర‌థ, ఫోన్ ట్యాపింగ్ త‌దిత‌ర అంశాల‌పై కేంద్రీక‌రించింది. అలాగే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి నెట్టింది. దీంతో డిసెంబ‌ర్‌లోనే తాగునీటి స‌మ‌స్య‌పై కేంద్రీక‌రించాల్సిన రేవంత్ స‌ర్కారు ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేకంగా దృష్టిపారించలేకపోయింది. అయితే పార్లమెంటు ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీకి అన్ని గ్రామాలు, ప‌ట్టాణాల నుంచి నీటి స‌మ‌స్య‌పైనే విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయి. దీంతో పార్టీ కార్య‌క‌ర్తలు, నేత‌లు అంద‌రూ తాగునీటి స‌మ‌స్యను సీఎం దృష్టికి తీసుకువ‌చ్చారు. తాగునీటి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌క పోతే ఓటింగ్‌లో ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. స‌మ‌స్య తీవ్ర‌త‌ను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి యుద్థ ప్రాతిప‌దిక‌పైన తాగునీటి స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

సీఎం రేవంత్ ఆదేశాల‌తో రంగంలోకి దిగిన అధికారులు జూన్ వరకు ఎండల తీవ్రత పెరిగినప్పటికీ తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు చేప‌ట్ట‌డానికి సిద్ద‌మ‌య్యారు. ఏ రోజుకారోజు ప్రభుత్వ యంత్రాంగం తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించాల‌ని నిర్ణయించింది. ఎక్కడన్నా తాగునీటి ఇబ్బంది ఉన్నట్లు ఫిర్యాదులు వ‌చ్చినా, వార్త క‌థనాలు వ‌చ్చినా వెంటనే అక్కడున్న సమస్యను తెలుసుకొని తాగునీటిని అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల‌ని రేవంత్ అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు.

వేసవిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పర్యవేక్షించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలకు పది మంది సీనియర్ ఐఏఎస్ లను ప్రత్యేక అధికారులుగా నియమించించింది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ను మినహాయిస్తే మొత్తం 142 పట్టణాలున్నాయి. వీటిలో 130 మున్సిపాలిటీలున్నాయి. 12 కార్పొరేషన్లున్నాయి. ఇందులో 130 పట్టణల్లో తాగునీటి సరఫరాకు ఢోకా లేదని,సాధారణ రోజులతో పోలిస్తే కేవలం పది శాతంలోపు తాగునీటి సరఫరా తగ్గినప్పటికీ ప్రజల అవసరాలకు సరిపడే నీటిని అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో సగటున రోజుకు 1398.05 ఎంఎల్డీల (మిలియన్స్ ఆఫ్‌ లీటర్స్‌ పర్ డే) తాగునీటి సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం 1371 ఎంఎల్డీల నీటి సరఫరా ఉంది. 26.31 ఎంఎల్డీల కొరత ఉన్న‌ట్లు స‌ర్కారు గుర్తించింది. ముఖ్యంగా10 మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్, ఖమ్మం రెండు కార్పొరేషన్ల పరిధిలో తాగునీటి కొరత ఎక్కువగా ఉందని అధికారుల నుంచి తెప్పించుకున్న నివేదిక‌ల ద్వారా తెలుసుకున్న‌ది. ఎండలు పెరిగిన కొద్దీ ఈ రెండు పట్టణాల్లో నీటి ఎద్దడి పెరుగుతుందనే అంచనాలతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది.

తలసరి నీటి అవసరాన్ని పరిశీలిస్తే 27 పట్టణాల్లో ప్రస్తుతం 135 ఎల్పీసీడీ (లీటర్స్ ప‌ర్ ప‌ర్స‌న్ ప‌ర్ డే) కంటే ఎక్కువ నీటి స‌ర‌ఫ‌రా ఉంది. 48 పట్టణాల్లో 100 నుంచి 135 ఎల్పీసీడీల మధ్య తాగునీటి సరఫరా జరుగుతోంది. 100 ఎల్పీసీడీ కంటే తక్కువగా సరఫరా అవుతున్న 67 పట్టణాలు సమస్యాత్మకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. అక్కడ ఎండాకాలానికి సరిపడే ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించి సరఫరా చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 23,839 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఇప్పటికైతే ఎక్కడా తాగునీటి ఎద్దడి లేదని మిషన్ భగీరథ అధికారులు చెబుతున్నారు. అన్ని గ్రామాల్లో 100 ఎల్ పీ సీడీ నీటి సరఫరా చేస్తున్నారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. గ్రిడ్ పంప్ ల‌తో పాటు స్టాండ్ బైగా పంప్ లు అందుబాటులో ఉంచారు. జిల్లా స్థాయిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు జిల్లా కలెక్టర్లకు మొత్తం రూ.100 కోట్ల నిధులు విడుదల చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా ఖర్చు చేసే వెసులుబాటు కల్పించారు.

స‌మీప నీటి వ‌న‌రుల‌ను ఉప‌యోగించుకోండి

పట్టణాలు, గ్రామాలన్నింటా సమీప నీటి వనరులను ఉపయోగించుకోవాలని ఇప్పటికే అన్ని మున్సిపల్, కార్పొరేషనల్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటు గోదావరి, ఇటు కృష్ణా పరిధిలోని రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గిపోవటంతో పాటు అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవటంతో తాగునీటి సమస్య ఉత్పన్నమైంది. నాగార్జునసాగర్ నుంచి పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్ల ద్వారా నల్గొండ, ఖమ్మం పట్టణాలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.మిడ్ మానేర్, ఎల్ ఎండీ నుంచి కరీంనగర్ పట్టణానికి సరిపడే నీటిని అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది. అవసరమైతే కర్ణాటక లోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కొంత నీటిని విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరాలని ఇప్పటికే ఇరిగేషన్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. నారాయణపూర్ నుంచి జూరాల రిజర్వాయర్ కు వచ్చే నీటితో గద్వాల మిషన్ భగీరథ కు తాగునీటి సరఫరా చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు 131 పట్టణాల్లో అందుబాటులో ఉన్న 294 ప్రభుత్వ ట్యాంకర్లతో పాటు 97 ట్యాంకర్లను అద్దెకు తీసుకుంది. అత్యవసరమైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చింది.