బ్యాంకులో షాకింగ్ ఘటన.. లాకర్‌లో ₹18 లక్షల నగదుకు చెద!

- 18 లక్షల నగదు పురుగుల పాలు
- బిడ్డ పెండ్లికి దాచిన డబ్బుకు చెద
- యూపీలోని బీవోబీలో ఘటన
విధాత: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. కూతురి పెండ్లి కోసం బ్యాంక్ లాకర్‌లో ఓ మహిళ దాచిన రూ.18 లక్షల నగదును చెదపురుగులు తినేశాయి. అల్కా పాఠక్ అనే మహిళ తన కుమార్తె వివాహం కోసం మొరాదాబాధ్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా రామగంగా విహార్ బ్రాంచ్ లాకర్‌లో నగలతోపాటు నగదును ఉంచింది. లాకర్‌లో పెట్టిన రూ. 18 లక్షల నగదును చెదపురుగులు పాడుచేసినట్టు గుర్తించి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
అధికారుల వివరాల ప్రకారం.. బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ రెన్యూవల్, కేవీఐ ధ్రువీకరణ కోసం అల్కా పాఠక్‌ను బ్యాంకు అధికారులు పిలిపించారు. ఈ సందర్భంగా ఆమె తన బ్యాంకు లాకర్‌ను ఓపెన్ చూడగా, నగదుకు చెదపట్టిన షాకింగ్ విషయం తెలిసింది. ఆమె ఈ విషయాన్ని బ్రాంచ్ మేనేజర్‌కు వెల్లడించింది. దీంతో బ్యాంకు అధికారులు విచారణ చేపట్టారు. ఇలా జరుగుతుందని తనకు తెలియదని, లేకుంటే తన డబ్బును బ్యాంకు లాకర్‌లో పెట్టేవాళ్లం కాదని పాఠక్ వాపోయారు.
అయితే, ఇది యాక్సిడెంటల్ ఘటన కాబట్టి నష్టపరిహారం అందే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఉదయపూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో లాకర్‌లో ఉంచిన రూ.2.15 లక్షలను కూడా ఇలాగే చెదపురుగులు ధ్వంసం చేశాయి.