విధాత: మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌నెట్ సేవలు శనివారం తిరిగి ప్రారంభమయ్యాయి. 100 రోజుల తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఈ విషయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వెల్లడించారు.
మణిపూర్‌లో జాతి హింస కారణంగా ఇంటర్నెట్ సేవలను బంద్‌చేసినట్టు, సామాన్య ప్రజల కోసం శనివారం నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర రాజధానిలో శనివారం ఆయన మీడియాతో “ఈ రోజు నుంచి మణిపూర్ ప్రజల కోసం ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభమవుతాయి” అని చెప్పారు.
మణిపూర్ ప్రభుత్వం జూలైలో షరతులతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను పునరుద్ధరించింది. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ దృష్ట్యా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రాష్ట్ర ప్రజలు 15 రోజుల్లోగా అక్రమ ఆయుధాలను అప్పగించాలని ప్రభుత్వం సూచించింది. లేనిపక్షంలో భద్రతా దళాలతో సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకుంటామని శుక్రవారం హెచ్చరించింది.
మణిపూర్‌లో కుకీ గిరిజనులు, మెయిటీ కమ్యూనిటీ మధ్య మే నెలలో అల్లలు చెలరేగాయి. అల్లర్లు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో వదంతులు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్ నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. మే 3నాటి నుంచి చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 160 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు.