One Nation One Election | జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి కోవింద్‌ కమిటీ నివేదిక.. ఏమని సిఫారసు చేసిందంటే..!

One Nation One Election | జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి కోవింద్‌ కమిటీ నివేదిక.. ఏమని సిఫారసు చేసిందంటే..!

One Nation One Election: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో లోక్‌సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై అధ్యయనం జరిపిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ.. ఇవాళ (గురువారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించింది. ఇవాళ ఉదయం రామ్‌నాథ్‌ కోవింద్ సహా కమిటీ సభ్యులంతా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి వారు రూపొందించిన 18,629 పేజీల నివేదికను రాష్ట్రపతికి అందజేశారు. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయం వ్యక్తంచేసింది.

జమిలి ఎన్నికలకు కోవింద్‌ కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది. మొదటి అంచెలో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్‌ నిర్వహించాలని పేర్కొంది. ఆ తర్వాత 100 రోజులకు రెండో అంచెలో మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని సూచన చేసింది. అందుకోసం రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాల్సి వస్తుందని తెలిపింది. ఇక ఈ మూడు స్థాయిల ఎన్నికలకు ఓటర్ల జాబితా ఉమ్మడిగా ఉండాలని పేర్కొంది.

కాగా, దాదాపు 190 రోజులపాటు జమిలి ఎన్నికలపై కమిటీ అధ్యయనం చేసింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. ఇందులో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపాయి. ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా 21,558 స్పందనలు వచ్చాయి. వారిలో 80 శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ నివేదికను రూపొందించింది.

జమిలి ఎన్నికల నిర్వహణపై గత కొన్నేళ్ల నుంచి ప్రచారం చేస్తున్న మోదీ సర్కారు.. 2023 సెప్టెంబర్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీలను కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్‌ చంద్రలకు కేంద్రం బాధ్యతలు అప్పగించింది.

ఇదిలావుంటే ‘ఒకే దేశం…ఒకే ఎన్నిక’ అంశంపై లా కమిషన్‌ కూడా తమ నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని చేర్చాలని లా కమిషన్‌ సూచించనున్నట్లుగా తెలుస్తోంది. 2029 నాటికి ఏకకాల ఎన్నికల నిర్వహణకు వీలయ్యేలా చేసేందుకు అవసరమైన మార్గ సూచీని లా కమిషన్‌ ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.