CM KCR: నేతల తలరాతలు మారాయి.. ప్రజల బతుకులు మారలేదు: సీఎం కేసీఆర్
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి.. పరిపాలించిన నేతల తలరాతలు మారాయి.. కానీ ప్రజల బతుకులు మారలేదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వీపీ సింగ్, చరణ్ సింగ్, దేవేగౌడ లాంటి కొంత మంది ప్రధానులను మినహాయిస్తే.. ఈ దేశాన్ని 54 ఏండ్లు కాంగ్రెస్, 14 ఏండ్లు బీజేపీ ప్రభుత్వాలు పాలించాయని తెలిపారు. వీరి పాలనలో రైతుల బతుకు మారలేదు అని కేసీఆర్ పేర్కొన్నారు. విధాత: మహారాష్ట్ర(Maharashtra)నాందేడ్ జిల్లాలోని కంధార్ లోహాలో […]

75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి.. పరిపాలించిన నేతల తలరాతలు మారాయి.. కానీ ప్రజల బతుకులు మారలేదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వీపీ సింగ్, చరణ్ సింగ్, దేవేగౌడ లాంటి కొంత మంది ప్రధానులను మినహాయిస్తే.. ఈ దేశాన్ని 54 ఏండ్లు కాంగ్రెస్, 14 ఏండ్లు బీజేపీ ప్రభుత్వాలు పాలించాయని తెలిపారు. వీరి పాలనలో రైతుల బతుకు మారలేదు అని కేసీఆర్ పేర్కొన్నారు.
విధాత: మహారాష్ట్ర(Maharashtra)నాందేడ్ జిల్లాలోని కంధార్ లోహాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్(BRS) బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ఎన్సీపీ(NCP) మాజీ ఎమ్మెల్యే శంకర్ రావు దొండే సహా పలువురికి కేసీఆర్(KCR) గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేదికపై ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ, బసవేశ్వరుడు, బీఆర్ అంబేద్కర్, మహాత్మా పూలే, అహల్యాబాయి హోల్కర్ విగ్రహాలకు కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు.
దళితబంధు, రైతుబంధు అమలు చేస్తే మహారాష్ట్రకు రాను..
తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేయాలి. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి. దళిత యోధుడు అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్ర గడ్డపై దళితులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, దళితుల కోసం దళితబంధు అమలు చేస్తే మహారాష్ట్రకు రానే రాను అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు కేసీఆర్ సవాల్ చేశారు. ఆ పథకాలు అమలు చేసే వరకు మహారాష్ట్రకు వస్తూనే ఉంటాను అని కేసీఆర్ స్పష్టం చేశారు. నేను భారతీయ పౌరుడిని కాబట్టి.. దేశంలో ఎక్కడైనా పర్యటిస్తానని చెప్పారు.
మహారాష్ట్రలో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఎందుకు..?
మహారాష్ట్రలోనే కృష్ణా, గోదావరి నదులు పుట్టాయి. కానీ ఈ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తాగు, సాగునీరు అందుబాటులో లేదు. సాగునీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహారాష్ట్రలో సంపదకు కొదువ లేదు.. ప్రజలకు ఇవ్వాలన్న మనసు పాలకులకు లేదు. తొమ్మిదేండ్ల క్రితం మహారాష్ట్ర కంటే తెలంగాణ దారుణంగా ఉండేది.
తెలంగాణలో సాధ్యమైంది.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు. దేశానికే ఆదర్శంగా తెలంగాణను అభివృద్ధి చేశాం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తాం. దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటల విద్యుత్ సులభంగా ఇవ్వొచ్చు అని కేసీఆర్ చెప్పారు.
మహారాష్ట్రలో మరో విప్లవం.. జిల్లా పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి..
మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ పార్టీని రిజిస్టర్ చేయించామని కేసీఆర్ తెలిపారు. జిల్లా పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. ప్రతి జిల్లా పరిషత్‌పై బీఆర్ఎస్ జెండా ఎగరాలి. వచ్చే ఎన్నికల్లో మీ నుంచే నాయకుడిని ఎన్నుకుంటే మార్పు వస్తుంది. రైతులు ఐక్యంగా పిడికిలి బిగిస్తే న్యాయం జరుగుతుంది. నేను ఒక్కసారి నాందేడ్ వచ్చి వెళ్తే మహారాష్ట్రలో రైతులకు బడ్జెట్‌లో నిధులు పెంచారు అని కేసీఆర్ గుర్తు చేశారు.
Live: BRS President, CM Sri K. Chandrashekar Rao speaking in a public meeting at Kandhar Loha, Maharashtra. https://t.co/cuKYRi0R22
— BRS Party (@BRSparty) March 26, 2023