విధాత: బొంకరా మల్లిగా అంటే చింతమడక మిర్యాలు తాటికాయంత అన్నాడట. అలా ఉన్నది రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు తీరు. రైతులకు రుణమాఫీ విషయంలో ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో జరిగే పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. వ్యవసాయశాఖ జారీచేసిన రైతుల రుణమాఫీ జాబితాకు బ్యాంకులు విడుదలచేసిన జాబితాకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.
రుణమాఫీ అయింది (రెమిటెడ్), త్వరలో రుణమాఫీ అవుతాయి (టు బీ ప్రాసెస్డ్), బ్యాంకులో సంప్రదించగలరు (డీపీటీ ఇష్యూ) అని గతంలో వ్యవసాయశాఖ రైతుల జాబితాను విడుదల చేసింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో అయిటిపాములలోని ఎస్‌బీఐ బ్యాంకు శాఖ పరిధిలో 1,137 మందికి రుణమాఫీ జరిగినట్టుగా వ్యవసాయశాఖ రైతుల జాబితాను విడుదల చేసింది. మరికొందరి పేర్లు టు బీ ప్రాసెస్డ్, డీపీటీ ఇష్యూ జాబితాలో ప్రకటించారు.
డబ్బులు జమకాలేదు..
రుణమాఫీ జరిగినట్టు వెల్లడించిన వ్యవసాయశాఖ జాబితా ఆధారంగా రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకొనేందుకు బ్యాంకుకు వెళ్లగా, మీ రుణమాఫీ డబ్బులు పడలేదని బ్యాంకు అధికారులు తాఫీగా సెలవిస్తున్నారు. బ్యాంకు మాత్రం 562 మందికే బ్యాంకులో రుణమాఫీ అయినట్టు మరో జాబితాను బ్యాంకు గోడలపై అతికించింది. మిగతా రైతుల రుణమాఫీ డబ్బులు బ్యాంకులో ఎప్పుడు జమ అవుతుందనే విషయంలో అధికారులు సైతం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. వ్యవసాయశాఖ అధికారులు కూడా వద్ద దీనిపై స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు.
ఈ విషయమై ఏఈవోను సంప్రదించగా.. తమకు తెలియదని, జిల్లా వ్యవసాయశాఖ రైతుల రుణమాఫీ జాబితాను విడుదల చేసినట్టు వెల్లడించారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో అయిటిపాములలోని ఒక్క ఎస్‌బీఐ బ్యాంకు శాఖలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయశాఖ విడుదలచేసిన రుణమాఫీ రైతుల జాబితాకు, బ్యాంకు అధికారులు జారీచేసిన జాబితాకు రైతుల సంఖ్యలో లక్షల్లో తేడా ఉన్నట్టు తెలుస్తున్నది.