Royal Enfield Classic 650 Tween: కొత్త బుల్లెట్ బండి వచ్చేసిందోచ్..!

దేశీయ బుల్లెట్ వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ తన కొత్తతరం బుల్లెట్ ప్రియుల కోసం ఎన్ ఫీల్డ్ 650సీసీ శ్రేణిలో క్లాసిక్ 650 ట్విన్ ను గురువారం భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. చాలా రోజులుగా వాహన ప్రియులు ఎదురుచూస్తున్న క్లాసిక్ 650 ట్విన్ లాంచ్ కావడంతో దీని ప్రత్యేకతలపై వారు  ఆసక్తి చూపుతున్నారు.

Royal Enfield Classic 650 Tween: కొత్త బుల్లెట్ బండి వచ్చేసిందోచ్..!

Royal Enfield Classic 650 Tween: బుల్లెట్..ఇది ద్విచక్ర వాహన ప్రియులకు దర్జా..దర్పాన్ని చాటుకునే సవారీ. డుక్ డుక్ మని బుల్లెట్ బండెక్కి వచ్చేస్తపా..అన్న పాట ఎంత ఫేమస్ నో..అంతకంటే పదింతల క్రేజ్ బుల్లెట్ బండి సొంతం. దశాబ్ధాలు గడుస్తున్నా..మార్కెట్ లోకి ఎన్నో ద్విచక్ర వాహనాలు పోటీగా వచ్చినా.. బుల్లెట్ బండి క్రేజ్ మాత్రం తగ్గేదేలే అంటుంది. తాజాగా దేశీయ బుల్లెట్ వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ తన కొత్తతరం బుల్లెట్ ప్రియుల కోసం ఎన్ ఫీల్డ్ 650సీసీ శ్రేణిలో క్లాసిక్ 650 ట్విన్ ను గురువారం భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. చాలా రోజులుగా వాహన ప్రియులు ఎదురుచూస్తున్న క్లాసిక్ 650 ట్విన్ లాంచ్ కావడంతో దీని ప్రత్యేకతలపై వారు  ఆసక్తి చూపుతున్నారు.

రాయల్ ఎన్ ఫీల్డ్ తన కొత్త క్లాసిక్ 650 ట్వీన్ లోనూ నియో రెట్రో లుక్ ను అనుసరించింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న క్లాసిక్ 350ని ఇది పోలి ఉంటుంది. రౌండ్ హెడ్ ల్యాంప్, టైగర్-ఐ పైలట్ ల్యాంప్స్ తో టియర్ డ్రాప్ ఆకారంలో ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. వల్లం రెడ్, బ్రంటింగ్ థార్ప్ బ్లూ, టీల్, బ్లాక్ క్రోమ్ రంగుల్లో లభిస్తుంది. 19 అంగుళాల ఫ్రంట్ వీల్, 18 అంగుళాల రియర్ వీల్ ఇచ్చారు. వైర్ స్పోక్ వీల్స్ అమర్చారు.

ఇంజిన్ విషయానికొస్తే.. ఇతర 650 సీసీ మోడళ్లలానే ఇందులోనూ 648 ఎయిర్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 46.4 హెచ్ పీ పవర్ ను, 52.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ తో 6 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తోంది. ముందువైపు 320 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనక వైపు 300 ఎంఎం డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ సదుపాయం ఉంది. ఎల్ఈడీ లైటింగ్ తో వస్తోంది. సెమీ అనలాగ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, టైప్-సి చార్జింగ్ పోర్ట్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ ఉన్నాయి. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650వంటి మోడళ్లకు ఈ మోటార్ సైకిల్ గట్టి పోటి ఇవ్వనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 650 ట్వీన్ ధరను రూ.3.37 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ నిర్ణయించింది. ఇందులో బ్లాక్ క్రోమ్ వేరియంట్ ధరను రూ.3.50 లక్షలుగా పేర్కొంది. ఇప్పటికే 650 సీసీ శ్రేణిలో ఇంటర్ సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మెటోర్ 650, షాట్న్ 650, బేర్ 650ని కంపెనీ లాంచ్ చేసింది.