రేపు అసెంబ్లీలో అధికార పక్షం పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. పోటీకి వచ్చిన విపక్షం..
తెలంగాణలో పదేండ్ల తర్వాత అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. అధికార పక్షం, విపక్షం మధ్య వాడివేడి చర్చ కొనసాగుతోంది.

హైదరాబాద్ : తెలంగాణలో పదేండ్ల తర్వాత అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. అధికార పక్షం, విపక్షం మధ్య వాడివేడి చర్చ కొనసాగుతోంది. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కింది. ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతిపక్ష నాయకులకు కనీస సమయం ఇవ్వకుండా మైక్ కట్ చేసేది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా సభా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విపక్షానికి తగినంత సమయం ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి తన రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తున్నారు.
ఇక మొన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగిన సందర్భంగా అధికార పక్షం, విపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే. మళ్లీ రేపు కూడా అలాంటి వాతావరణం అసెంబ్లీలో ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే.. ప్రభుత్వ శాఖలన్నింటిపైనా శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ వివరాలను అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించాలని భావిస్తోంది. ఇందుకోసం శాసనసభలోనే ఒక భారీ సైజు స్ర్కీన్‌ను ఏర్పాటు చేయనుంది. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులు, వాటి ద్వారా కలిగిన నష్టాలను రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందన్న సమాచారం నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లేఖ రాశారు. తమకూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను హరీశ్‌రావు కోరారు. తాము కూడా ఆర్థికంతో పాటు ఇతర అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరిస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
గడిచిన పదేండ్లలో ప్రభుత్వ శాఖలకు వచ్చిన లాభ నష్టాలు, ఎన్ని అప్పులు తెచ్చారనే అంశంపైనా సమగ్ర వివరాలను సీఎం రేవంత్ రెడ్డి సేకరించారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ప్రత్యేకించి నీటిపారుదల, విద్యుత్తు, ఆర్థిక శాఖల పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి వివరించనున్నట్లు సమాచారం.
2016లో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
బుధవారం రేవంత్ రెడ్డి శాసనసభలో ఇవ్వనున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన ఏం చెప్పబోతున్నారనేది కీలకం కానుంది. అయితే 2016లో కూడా నాటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులు, సాగునీటి రంగంపై తమ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతుందనే వివరాలను అప్పట్లో కేసీఆర్ తన ప్రజంటేషన్‌లో వివరించారు. ఇప్పుడు.. రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన వైఫల్యాలు, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను అసెంబ్లీలోనే వెల్లడించనున్నారు.