వెల్లుల్లి ఘాటు..! భారీగా పెరిగిన ధర..!
మొన్నటి వరకు ఉల్లగడ్డ ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల కాస్త దిగివచ్చాయి. తాజాగా వెల్లుల్లి ధరలు వంతు వచ్చింది. ప్రస్తుతం వెల్లి ధరలు విపరీతంగా పెరిగాయి

Garlic Price Hike | మొన్నటి వరకు ఉల్లగడ్డ ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల కాస్త దిగివచ్చాయి. తాజాగా వెల్లుల్లి ధరలు వంతు వచ్చింది. ప్రస్తుతం వెల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఆహార ద్రవ్యోల్బణం దేశంలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో వెల్లుల్లి కిలో ధర రూ.400 దాకా చేరింది. ధరల భారంతో వెల్లుల్లి కొనడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
భారతీయులు ఎక్కువగానే వెల్లుల్లిని వినియోగిస్తుంటారు. కూరగాయలతో పాటు మాంసాహారంలోనూ అల్లంవెల్లుల్లిని వినియోగిస్తుంటారు. పెరిగిన ధరలు వెల్లుల్లి వంటల్లో కనిపించని పరిస్థితి నెలకొన్నది. మార్కెట్‌లో ఉత్పత్తి తగ్గడంతోనే ధరలు పెరిగాయని, కొత్త దిగుబడులు వచ్చేందుకు సమయం పడుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. గత రెండు నెలల కిందట పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంట నీటిపాలైంది.
ముఖ్యంగా మహారాష్ట్రలోని నాసిక్, పుణె ప్రాంతాల్లో వెల్లుల్లి దెబ్బతిన్నది. అలాగే మహారాష్ట్రాలోని చాలా ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి తగ్గనున్నది. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వెల్లుల్లికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో ధరలు పెరుగుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి వెల్లుల్లి కొనుగోలు చేస్తుండగా.. రాబోయే రెండు మూడు నెలల్లో వెల్లుల్లి ధరలు భారీగానే ఉండే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు