డీజే టిల్లు చిత్రంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సిద్దు జొన్నలగడ్డ మరోసారి అభిమానులకు టిల్లు స్క్వేర్ తో ఓ డబుల్ ఎంటర్ టైనర్ అందించాడు
సినిమా: టిల్లు స్క్వేర్
నటీనటులు: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళి శర్మ, ప్రిన్స్ సెసిల్, మురళీధర్ గౌడ్, నేహా శెట్టి తదితరులు
ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్
సంగీతం: రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో
రచన: సిద్దు జొన్నలగడ్డ, రవి ఆంటోనీ
నిర్మాత: సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య
దర్శకత్వం: మల్లిక్ రామ్
విధాత, సినిమా: డీజే టిల్లు చిత్రంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సిద్దు జొన్నలగడ్డ మరోసారి అభిమానులకు టిల్లు స్క్వేర్ తో ఓ డబుల్ ఎంటర్ టైనర్ అందించాడు. టిల్లుగా జొన్నలగడ్డ తన పాత్రతో ఆధ్యంతం మరోసారి ప్రేక్షకులను అలరించగా, లిల్లి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చాలా హాట్ గా కనిపించింది. లిప్‌లాక్ సీన్లలోనూ నటించి తనలో కొత్త కోణం ఆవిష్కరించింది. రాధిక పాత్రలో నేహా శెట్టి తన మార్క్ నటన చూపింది. లిల్లీ, టిల్లుల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, టిల్లు ఫ్యామిలీకి.. లిల్లీ తండ్రికి మధ్య వచ్చే సన్నివేశాలు, గతాన్ని గుర్తు చేసుకుంటూ టిల్లు చెప్పే సంభాషణలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతాయి.
మరోసారి పుట్టిన రోజున టిల్లు కేసుల్లో ఇరుక్కోవడం..సినిమా మధ్యలో డీజే టిల్లులోని రాధిక పాత్ర కూడా ఎంటరవ్వడంలో కథ మలుపులతో పంచ్ డైలాగ్‌లతో ముందుకెళ్లింది. టిల్లుకు ఒక ఈవెంట్ లో లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) పరిచయం అవుతుంది. వెంటనే టిల్లు ఆమెకి పడిపోగా, ఆమెతో ఒక రాత్రి గడిపుతాడు. తెల్లవారేసరికి ఆమె ఒక ఉత్తరం పెట్టి మాయం అవుతుంది. టిల్లు ఆమెకోసం వెతుకుతూ ఉంటాడు. నెలరోజుల తరువాత ఒకరోజు ఆసుపత్రి దగ్గర లిల్లీ కనపడుతుంది. తాను ప్రేగ్నంట్ అని, అందుకు టిల్లునే కారణమని చెపుతుంది. టిల్లు తల్లిదండ్రులు కూడా ఆమెను చేసుకోమని చెప్పగా, లిల్లీని పెళ్లి చేసుకుంటానంటాడు.
టిల్లు పుట్టినరోజుకు లిల్లీని కూడా తీసుకురావటానికి టిల్లు వెళ్లి లిల్లీ వున్న లొకేషన్‌కు వెళ్లగా, ‘డీజె టిల్లు’ లో రాధిక కోసం కూడా అదే అపార్ట్మెంట్స్ కి టిల్లు రావడం గుర్తుకొస్తుంది. మళ్ళీ ఇప్పుడు లిల్లీ కోసం కూడా అదే అపార్ట్మెంట్స్ కి రావటంతో ఎదో తేడా కొడుతోందని టిల్లుకి అర్థం అవుతోంది. లిల్లీని కలిసి అసలు ఏమైందని అడిగితే తన అన్న రోహిత్ తప్పిపోయి అప్పటికి ఒక సంవత్సరం అయిందని చెపుతుంది. టిల్లులో అలజడి రేగుతుంది. ఎందుకంటే రోహిత్ ని డీజే టిల్లు’ లో పూడ్చిపెట్టింది అతనే కాబట్టి.
ఇంతకీ లిల్లి ఎవరన్న ఆసక్తితో పాటు ఆమె కొత్త పాత్రలోకి మారడం, రాధిక మరోసారి టిల్లు కథలోకి రావడం వంటి ఆసక్తికర మలుపులకు హాస్యాన్ని, ఉత్కంఠతను జోడించి స్క్రీన్‌ప్లేను నడిపించారు. రోహిత్ నిజంగానే లిల్లీకి అన్నయ్య అవుతాడా? అప్పటి పాత కేసు మళ్ళీ ఎందుకు తిరగతోడారు? ప్రిన్స్ సెసిల్ మళ్ళీ టిల్లు ని ఏమి చేస్తాడు? అంతర్జాతీయ డాన్ (మురళి శర్మ) హైదరాబాదు ఎందుకు వస్తున్నాడు? అతనికి టిల్లుకి ఏంటి సంబంధం? అసలు ఈ కథంతా ఎటు వెళుతుంది? టిల్లు పుట్టినరోజునాడు ఎందుకు అలా కేసుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు? ఇవన్నీ తెలియాలంటే ‘టిల్లు స్క్వేర్’ సినిమా చూడాల్సిందే.
చివరగా : తన పంచ్.. మార్క్ డైలాగ్‌లతో నవ్వించిన టిల్లు
రేటింగ్: 3.5