Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ !

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గైడ్ సాక్షిగా సిట్ ముందు హాజరవుతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందన్ని అభియోగాలున్నాయి. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా, ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను సాక్షిగా పాల్గొనాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరారు. పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం ఇవ్వబోతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు ముందు బాధితులలో ముఖాముఖి నిర్వహించి వారిని సాక్షులుగా పేర్కొనాలని సిట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 600మంది వరకు బాధితుల జాబితాను సిద్ధం చేశారు. జాబితాలో ప్రస్తుత మంత్రిగా ఉన్న వ్యాపార సంస్థల ఉద్యోగులు కూడా ఉన్నారు. వారందరిని ప్రభాకర్ రావు ముందు కూర్చోబెట్టి వారంతా ఫోన్ ట్యాపింగ్ తో పడిన ఇబ్బందులను చెప్పించి…దానికి ప్రభాకర్ రావు ఇచ్చే సమాధానాన్ని నమోదు చేయాలని సిట్ నిర్ణయించింది. బాధితులు లేదా సాక్షులుగా ఉన్న వారిలో చాలమంది ప్రముఖులు ఉండటంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.