పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. నిబంధనలు ఇవే..
ఆరు గ్యారెంటీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఉత్తర్వులు జారీ చేసింది

హైదరాబాద్: ఆరు గ్యారెంటీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహాలక్ష్మి పథకం కింద రేపట్నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో శనివారం మధ్యాహ్నం నుంచి ఉచితంగా ప్రయాణించొచ్చని తెలిపారు.
రాష్ట్ర పరిధిలో తిరిగే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. సిటీలో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి కల్పించారు. అంతరాష్ట్ర బస్సులకు తెలంగాణ పరిధి వరకు ఉచితంగా ప్రయాణించొచ్చు. ఇక మహిళలకు సంబంధించిన ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది. త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను అందించనుంది ప్రభుత్వం. మొదటి వారం రోజుల పాటు ఎలాంటి గుర్తింపు లేకుండా మహిళలు ప్రయాణించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.