Tungaturthi | తుంగతుర్తిపై కాంగ్రెస్ ఆశావహుల నజర్! గాదరిని ఢీకొట్టేది ఎవరో..? తెరపైకి పిడమర్తి!!
Tungaturthi విధాత: నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి గాదరి కిషోర్ ను మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ మంత్రి కేటీఆర్ ప్రగతి నివేదన సభలో చేసిన ప్రకటనతో ఆ పార్టీ అభ్యర్థి పై క్లారిటీ వచ్చింది. గాదరికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుండి ఎన్నికల్లో ఢీకొట్టబోయే అభ్యర్థి ఎవరన్న దానిపై రోజురోజుకు గందరగోళం పెరిగిపోతుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన అద్దంకి దయాకర్ […]

Tungaturthi
విధాత: నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి గాదరి కిషోర్ ను మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ మంత్రి కేటీఆర్ ప్రగతి నివేదన సభలో చేసిన ప్రకటనతో ఆ పార్టీ అభ్యర్థి పై క్లారిటీ వచ్చింది. గాదరికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుండి ఎన్నికల్లో ఢీకొట్టబోయే అభ్యర్థి ఎవరన్న దానిపై రోజురోజుకు గందరగోళం పెరిగిపోతుంది.
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన అద్దంకి దయాకర్ స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడారు. ఎందుకో గాని ఆయన ఈ దఫా నియోజకవర్గానికి కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన తుంగతుర్తి నుండి మళ్ళీ పోటీ చేస్తారంటూ ఖచ్చితంగా అద్దంకి అనుచరులు కూడా చెప్పలేకపోతున్నారు. దయాకర్ కు పోటీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయుడైన డాక్టర్ వి.రవి, దామోదర్ రెడ్డి వర్గీయుడైన గుడిపాటి నర్సయ్యలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
పొంగులేటితో పాటు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్న పిడమర్తి రవి తాను తుంగతుర్తిలో పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ టికెట్ కోసం ఈ నియోజకవర్గంలో పిడమర్తి రూపంలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చినట్లు అయింది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గాదరి కిషోర్ కు దీటుగా విద్యార్థి ఉద్యమాన్ని సాగించడంలో పిడమర్తి రవి చేసిన ఉద్యమాలు కీలకంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్ ను ఢీకొట్టేందుకు పిడమర్తి రవి రూపంలో కాంగ్రెస్ బలమైన అభ్యర్థి పేరును తెర పైకి తెచ్చిందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
సరిగ్గా ఇదే సమయంలో తుంగతుర్తి బిఆర్ఎస్ టికెట్ ను ఆశిస్తూ వరుసగా అన్ని ఎన్నికల్లోను భంగపడుతూ వస్తున్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామెల్ సైతం ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నుండి పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఆయన ఏ పార్టీలో చేరుతారు.. ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న దాని పై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
తుంగతుర్తి నియోజకవర్గంలో రెండు పర్యాయాలు వరుస సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గాదరి కిషోర్ చేసిన అభివృద్ధి కంటే ల్యాండ్, సాండ్ మైన్, వైన్ దందాల్లో.. దళిత బంధు పథకంలో ఎదుర్కొన్న ఆరోపణలే జనంలో ఎక్కువ చర్చనీయాంశంగా ఉన్నాయని అవే తమను గెలిపిస్తాయని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నమ్ముతున్నారు.
కేసీఆర్ పథకాలు, అయితే తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే కిషోర్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ఎన్నికలనాటి పరిస్థితులు.. కాంగ్రెస్, బిజెపి సహా ఇతర పార్టీల అభ్యర్థుల ఖరారు వంటి అంశాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి ప్రజలు అధికార ప్రతిపక్ష పార్టీలలో ఎవరు వైపు ఉంటారో తేలనుంది.