Mysore Pak: మైసూర్ పాక్‌లో.. పాక్ ఔట్! కొత్త పేరేంటంటే?

Mysore Pak: పహల్గాం ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్నాయి. అసలు పాకిస్థాన్ పేరు వింటేనే కొందరు భారతీయులు రగిలిపోతున్నారు. ఉగ్రవాదాన్ని పాక్ పెంచిపోషిస్తున్నదన్న ఆరోపణలే అందుకు కారణం. ఇదిలా ఉంటే ఆపరేషన్ సిందూర్ అనంతరం సోషల్ మీడియాలో కొన్ని విచిత్రమైన డిమాండ్లు వినిపించాయి.
మైసూర్ పాక్ లో నుంచి పాక్ తీసేయాలని డిమాండ్ వినిపించింది. ఇక కరాచీ బేకరీల పేరు మార్చాలని కొందరు హిందూవాదులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ స్వీట్ షాప్ యజమాని తన దుకాణంలో విక్రయిస్తున్న మైసూర్ పాక్ పేరును మైసూర్ శ్రీగా మార్చాడు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో ‘త్యోహార్ స్వీట్స్’ ఎంతో ఫేమస్. ఇక ఈ స్వీట్ షాపు యజమాని మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ పేర్లను మార్చి.. మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గోండ్ శ్రీ అని కొత్త పేర్లు పెట్టారు. స్వర్ణ భాషం పాక్, చాందీ భాషమ్ పాక్‌ను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా మార్చి తన దుకాణంలోఓ విక్రయిస్తున్నాడు. దేశభక్తి తోనే తాను ఈ పని చేసినట్టు సదరు వ్యాపారి చెప్పడం గమనార్హం. నిజానికి పాక్ అనే పదం సంస్కృతం నుంచి వచ్చిందని.. భాషా నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు దేశభక్తులు మాత్రం ఆ పదం పేరు వింటేనే రగిలిపోతున్నారు.