Uber | బ్యాట‌రీ ఛార్జింగ్‌ను బ‌ట్టి క్యాబ్ ధ‌ర ఉంటోందా?.. ఉబెర్‌పై వార్తాప‌త్రిక ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నం

Uber | ప్ర‌జా ర‌వాణా రంగంలో విప్ల‌వం సృష్టించిన ఉబెర్ (Uber) పై వ‌చ్చిన క‌థ‌నం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. యూజ‌ర్ బ్యాట‌రీ ఛార్జింగ్ శాతాన్ని బ‌ట్టి ట్రిప్పు ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తోంద‌ని బెల్జియ‌న్ వార్తా ప‌త్రిక ఒకటి ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఒకే ట్రిప్పుకు ఛార్జింగ్ శాతం ఎక్కువున్న ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటే త‌క్కువ‌ రేటు.. ఛార్జింగ్ త‌క్కువున్న ఫోన్ నుంచి బుక్ చేసుకుంటే ఎక్కువ‌ రేటును చూపిస్తోంద‌ని వెల్ల‌డించింది. ఈ వాద‌న‌ను ధ్రువీక‌రించ‌డానికి వార్తా […]

  • By: krs    latest    Aug 11, 2023 3:08 PM IST
Uber | బ్యాట‌రీ ఛార్జింగ్‌ను బ‌ట్టి క్యాబ్ ధ‌ర ఉంటోందా?.. ఉబెర్‌పై వార్తాప‌త్రిక ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నం

Uber |

ప్ర‌జా ర‌వాణా రంగంలో విప్ల‌వం సృష్టించిన ఉబెర్ (Uber) పై వ‌చ్చిన క‌థ‌నం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. యూజ‌ర్ బ్యాట‌రీ ఛార్జింగ్ శాతాన్ని బ‌ట్టి ట్రిప్పు ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తోంద‌ని బెల్జియ‌న్ వార్తా ప‌త్రిక ఒకటి ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఒకే ట్రిప్పుకు ఛార్జింగ్ శాతం ఎక్కువున్న ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటే త‌క్కువ‌ రేటు.. ఛార్జింగ్ త‌క్కువున్న ఫోన్ నుంచి బుక్ చేసుకుంటే ఎక్కువ‌ రేటును చూపిస్తోంద‌ని వెల్ల‌డించింది. ఈ వాద‌న‌ను ధ్రువీక‌రించ‌డానికి వార్తా ప‌త్రిక ప్ర‌తినిధులు ఒక చిన్న ప‌రిశీల‌న కూడా చేశారు.

బ్ర‌సెల్స్ (Brussels) లోని వారి ఆఫీసు నుంచి న‌గ‌రంలోని ఒక ప్ర‌సిద్ధ కూడ‌లికి క్యాబ్ బుక్ చేయ‌డానికి రెండు ఫోన్లు వాడారు. అందులో ఒక‌టి 12 శాతం ఛార్జింగ్‌తో మ‌రొక‌టి 84 శాతం ఛార్జింగ్‌తో ఉన్నాయి. ట్రిప్పు పూర్త‌య్యాక చూస్తే 12 శాతం ఉన్న బ్యాట‌రీతో బుక్ చేసిన క్యాబ్ 17.56 యూరోలు (రూ.1585) ఛార్జ్ చేయ‌గా.. అదే మార్గంలో 84 శాతం ఛార్జింగ్ ఉన్న ఫోన్‌తో బుక్ చేసిన క్యాబ్ 16.6 యూరోలు (రూజ.1489) తీసుకుంది. దీంతో ఉబెర్ ఛార్జిల‌ను నిర్ణ‌యించ‌డంలో యూజ‌ర్ల సెల్‌ఫోన్ ఛార్జింగ్ ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటోందా అనే సందేహం వ‌స్తోంద‌ని త‌న క‌థ‌నంలో పేర్కొంది.

అయితే ఉబెర్ ఈ ఆరోప‌ణ‌ల‌ను కొట్టిప‌రేసింది. క్యాబ్ ఛార్జీల‌ను నిర్ణ‌యించ‌డంలో బ్యాట‌రీ ఛార్జింగ్ శాతం పాత్రేమీ (Charges Based on Battery Percentage) ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. క్యాబ్ ఛార్జీలు ఒకే దూరానికి వేర్వేరుగా ఉండొచ్చు. అప్పుడు ఆ రూట్‌లో ఉన్న డిమాండ్‌, డ్రైవ‌ర్ల ల‌భ్య‌త‌ల మీద ఆధార‌ ప‌డి ఈ హెచ్చుతగ్గులు ఉంటాయి అని పేర్కొంది.

అయితే 2016లో ఇచ్చిన ఓ ఇంట‌ర్య్వూలో ఉబెర్ మాజీ ఎక‌న‌మిక్ రీసెర్చ్ చీఫ్ కేత్ చెన్ మాట్లాడుతూ… బ్యాట‌రీ శాతం త‌క్కువ‌గా ఉన్న యూజ‌ర్ల‌కు క్యాబ్ రేట్లు కాస్త ఎక్కువ‌గా చూపిస్తున్నట్లు గుర్తించామ‌ని తెలిపారు. అప్పుడే ఈ విష‌యంపై ప‌లు విమ‌ర్శ‌లు త‌లెత్తాయి.

యూజ‌ర్ల క్ర‌మ‌శిక్ష‌ణ‌ను బ‌ట్టి ఛార్జీలు నిర్ణ‌యించే అధికారం ఉబెర్‌కు ఎవ‌రిచ్చార‌ని ప‌లువురు ప్రశ్నించారు. అయితే కంపెనీ కావాల‌ని అలా చేయ‌డం లేద‌ని చెన్ త‌ర్వాత వివ‌ర‌ణ ఇచ్చారు. దీనిపై మ‌రో సారి వివాదం త‌లెత్తిన నేప‌థ్యంలో.. ఈ సారి సంస్థ ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.