Hyd Metro | మెట్రో రైలు ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపుకు రంగం సిద్ధం!

  • By: sr    news    Apr 17, 2025 8:55 PM IST
Hyd Metro | మెట్రో రైలు ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపుకు రంగం సిద్ధం!

విధాత: హైదరాబాద్ మెట్రో ప్రయాణిలకు మెట్రో సంస్థ ఎల్ ఆండ్ టీ షాక్ ఇవ్వబోతుంది. మెట్రో చార్జీల పెంపుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది. రూ.6500 కోట్ల భారీ నష్టాల సర్థుబాటు పేరుతో చార్జీల పెంపు భారాన్ని ప్రయాణికులపై మోపనుంది. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దుతో పాటు, మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్ సైతం మెట్రో సంస్థ ఎత్తివేసింది. ఇటీవల బెంగళూరులో 44% మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్ లో ఎంత పెంచాలనే యోచనలో ఎల్ ఆండ్ టీ మెట్రో సంస్థ కసరత్తు చేస్తుంది.

ప్రస్తుతం కనిష్ఠ ఛార్జీ రూ.10. గరిష్ఠంగా ఛారీలు రూ.60 ఉన్నాయి. వాటిని ఎంతమేరకు పెంచాలన్నదానిపై మెట్రో సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సేవలు 2017 నవంబరు నుంచి దశలవారీగా అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి గత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మెట్రోరైలు నష్టాలు రూ.6,500 కోట్లకు చేరాయని ఎల్ ఆండ్ టీ సంస్థ పేర్కొంది. స్టేషన్లు, మాల్స్‌లో రిటైల్‌ స్పేస్‌ లీజ్, ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపర్చుకోవడానికి సంస్థ నిరంతర ప్రయత్నాలు చేస్తున్నా నష్టాలు భరించలేని స్థాయికి చేరాయని చెబుతోంది. అందుకే చార్జీల పెంపు అనివార్యమంటోంది.

గతంలోనూ చార్జీల పెంపు ప్రతిపాదనలు!

హైదరాబాద్ మెట్రో సంస్థ(ఎల్ఆండ్ టీ) గతంలో కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయామని మెట్రోరైలు ఛార్జీలను సవరించాలని 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ(ఎఫ్‌ఎఫ్‌సీ) ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరగా కేంద్ర ప్రభుత్వం మెట్రోరైల్వే (ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ యాక్ట్‌ 2002) సెక్షన్స్‌ 33, 34 ప్రకారం ఎఫ్ ఆర్ సీ కమిటీ ఏర్పాటు చేసింది. ద్రవ్యోల్బణం, టోకు ధరల సూచీ, ఎల్‌ అండ్‌ టీ మెట్రో ప్రతిపాదనలను అధ్యయనం చేసిన కమిటీ ప్రయాణికుల అభ్యంతరాలను కూడా పరిశీలించి ఛార్జీలను సవరించాలని సిఫార్సు చేసింది.

కానీ అందుకు అప్పటి ప్రభుత్వం అనుమతించక పోవడంతో ఛార్జీల పెంపు వాయిదా పడింది. మళ్లీ తాజాగా మరోసారి మెట్రో చార్జీల పెంపు ప్రతిపాదనలు ఎల్ ఆండ్ టీ తెరపైకి తెచ్చింది. అయితే ఈ దఫా కొత్తగా ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ వేస్తారా? లేక పాత కమిటీ సిఫార్సులతో చార్జీలను పెంచుతారా? అన్న చర్చ సాగుతోంది. అదిగాక చార్జీల పెంపుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదా? మెట్రో సంస్థనే స్వతహాగా చార్జీల పెంపును అమలు చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.